అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.. దీనిని సభకు సమర్పించారు. అనంతరం.. చైర్మన్ సీపీ రాధాకృష్ణన్.. చర్చకు అనుమతించారు. తొలుత టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఈ చర్చను ప్రారంభించారు. తనదైన శైలిలో ఆయన సభలో దుమ్మురేపారు.
రాజధానికి సంబంధించి పూర్వాపరాలతో పాటు.. చంద్రబాబు-జగన్ ప్రభుత్వాల హయాంలో రాజధాని పరిస్థితి.. ఇప్పుడు ఏం జరుగుతోంది? భవిష్యత్తులో ఏం జరుగుతుంది.. ఇలా.. అన్ని అంశాలను కూలంకషంగా వివరించారు. రాష్ట్ర విభజనను సమర్ధిస్తూనే.. కానీ.. విభజన జరిగిన తీరును తీవ్రంగా విభేదించారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని.. పైగా 16 వేల కోట్లరూపాయల లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని విడదీశారని తెలిపారు.
దీంతో ప్రజలు అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబుపై నమ్మకం పెట్టుకుని 2014 ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజదాని ఉంటుందని.. అది కూడా నదుల సమీపంలోనే ఉంటుందని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు.. ఈ క్రమంలోనే అన్నీ ఆలోచించి కృష్ణానది పక్కన ఏపీ రాజధాని అమరావతికి అంకురార్పణ చేశారని తెలిపారు. రైతులను మెప్పించి.. 33 వేల ఎకరాలకు పైగా భూములు సమీకరణ విధానంలో తీసుకున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి జరుగుతున్న క్రమంలో వైసీపీ ప్రభుత్వం సర్వంనాశనం చేసిందని రామ్మోహన్ గుర్తు చేశారు. దీనికి సంబంధించి రైతులు ఉద్యమం చేసి.. రాజధానిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయగా.. దానిపైనా వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలిపారు. మరోసారి ప్రజలు చంద్రబాబుపై ఉన్న విశ్వాసం తోనే గెలిపించారని.. ఈ క్రమంలో ఇప్పుడు రాజధానిని నిలబెట్టేందుకు.. `దుష్టశక్తుల` నుంచి రాజధానిని రక్షించేందుకు అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకే.. చంద్రబాబు పూనుకొన్నారని తెలిపారు. ఇది చరిత్రలో ఓ మైలురాయిలా నిలిచిపోతుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
