ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా.. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వాయు వేగ మనో వేగాలతో కదలడం గమనార్హం. ఉదాహరణకు.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ అభిశంసనపై సమర్పించిన బిల్లు.. గతంలో అలహాబాద్ హైకోర్టులో పనిచేసిన జస్టిస్ వర్మ అభిశంసన బిల్లుతోపాటు.. మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానం వంటి పలు బిల్లులు సభలో పెండింగులో ఉన్నాయి.
అయినప్పటికీ.. అమరావతికి చట్టబద్ధత కోరుతూ… మార్చి 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై.. చర్చించి ఆమోదించి తీర్మానం చేసింది. దీనిని వెనువెంటనే కేంద్ర హోం శాఖకు పంపించారు. అయితే.. వాస్తవానికి ఇది లోక్‌సభ, రాజ్యసభలకు వచ్చేందుకు సమయం పడుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ, అనూహ్యంగా కేవలం 3 రోజుల్లోనే ఈ తీర్మానంపై కేంద్ర హోం శాఖ బిల్లును రూపొందించడం.. దానికి ఉన్న అడ్డంకులు తొలగించడం..ఆవెంటనే బుధవారం లోక్‌సభకు రావడం అన్నీ వాయువేగంతో జరిగిపోయాయి.
ఇంత వేగంగా ఇటీవల కాలంలో ఒక బిల్లును ప్రవేశ పెట్టిన చరిత్ర కేంద్రానికి లేదు. అలాంటిది అంత వేగంగా రావడంవెనుక ఏం జరిగింది? అనేది చర్చనీయాంశం. ఈ విషయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెరవెనుక చక్రం తిప్పారన్న విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆయనేనేరుగాహోం శాఖ మంత్రి అమిత్‌షాతో మాట్లాడి.. బిల్లును సాధ్యమైనంత వేగంగా సభకు వచ్చేలా చూడాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. అమిత్ షా కూడా.. తమ తరఫున అంతా క్లియర్‌గానే ఉందని పేర్కొన్నారు. మొత్తంగా వెంకయ్య విజయం సాధించారు.
అయితే.. ఈయన ఒక్కరే కాదని తాజాగా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ బిల్లు విషయంలో చాకచక్యంగా వ్యవహరించారని తెలిసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ఉన్న అనుబంధం, నాయకులతో ఉన్న చనువు కారణంగా.. వారిని ఈ బిల్లు విషయంలో ఒప్పించినట్టు తెలిసింది.
అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులకు కూడా ఆమె అమరావతి ప్రాధాన్యం రైతుల త్యాగాలు.. వైసీపీ విధ్వంసం వంటి వాటిని వివరించి.. ఒప్పించారని అంటున్నారు. ఏదేమైనా.. ఈ వ్యవహారంలో కూటమి ఎంపీలు, కేంద్ర మంత్రులతో పాటు వెంకయ్య, దగ్గుబాటి తెరవెనుక బలమైన కృషి చేశారని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
