వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా కీలక నేతలే.. వైసీపీ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరును సీనియర్ నేతలు, పదవుల్లో ఉన్నవారే విమర్శిస్తుండడం గమనార్హం. దీంతో పార్టీలో ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొంది. ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న రాజకీయ చర్చ కూడా జోరుగా సాగుతుండడం గమనార్హం. అయితే.. ప్రస్తుతానికి పార్టీ మాత్రం మౌనంగా ఉంది. దీనిపై జగన్ సమీక్షిస్తారని.. సదరు నేతల గురించి ఆలోచన చేస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.
ఏం జరిగింది?
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఏసీపీ చంద్రగిరి ఏసురత్నం.. వైసీపీ నేతల వైఖరిని బహిరంగంగానే ఎండగట్టారు. ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ.. శ్రీకాకుళంలో మహిళా ఎస్సై ప్రవల్లికను చుట్టుముట్టి గేలి చేయడం.. ఆమెపై దుర్భాషలు ఆడడం సరికాదని.. ఒక మాజీ పోలీసు అధికారిగా ఈ వ్యవహారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అంతేకాదు.. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఏపీ పోలీసు సంఘానికి తాను కూడా సంఘీ భావం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. మహిళా ఎస్సైపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించినా తప్పులేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో చర్చకు దారితీశాయి.
ఇక, శ్రీకాకుళం జిల్లాకుచెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం శ్రీకాకుళంలో జరిగిన ఘటనను తప్పుబట్టారు. పోలీసులతో వాదనకు దిగడం, మహిళా ఎస్సైపై వాగ్వాదానికి దిగి తోసేప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇలా.. సొంత నేతలే భిన్నమైన వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ ఇప్పుడు ఆత్మ రక్షణలో పడింది. వాస్తవానికి శ్రీకాకుళం ఘటనను సమర్థించుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం పెడుతున్న కేసులను తిప్పికొడతామని కూడా ప్రకటిస్తోంది. ఇలాంటి సమయంలో సొంత నేతల్లోనే నిరసన స్వరాలు వినిపించడంతో ఇప్పుడు ఏం చేయాలన్న విషయంలో ఆత్మరక్షణలో పడడం గమనార్హం. ఈ నిరసన మున్ముందు పెరుగుతుందా? లేక, ఇక్కడితో ఆగుతుందా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates

