తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు షెడ్యూల్ కానీ, ప్రకటన కానీ.. ఇంకా ప్రకటించకపోయినా.. బీజేపీ మాత్రం దూకుడుగా ముందుకు సాగుతోంది. వాస్తవానికి ఈ టికెట్‌ను బీజేపీ పొత్తు పార్టీ జనసేన భారీ ఎత్తున డిమాండ్ చేస్తోంది. తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము పోటీకి దూరంగా ఉండి.. బీజేపీకి సహకరించాం కనుక ఈ టికెట్‌ను తమకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి కమిటీ వేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఎలా ఉందో తెలియదు కానీ.. బీజేపీ మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది.
ఇప్పటికే బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు.. జనసేన మద్దతుతో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించేశారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు ఫైరయ్యారు. కమిటీ ఇంకాఏమీ తేల్చకుండానే ఎలా నిర్ణయిస్తారని అన్నారు. కానీ, మరోపక్క బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువారం బీజేపీ నేతలు తిరుపతి పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఈ సంకేతాలకు మరింత బలం చేకూరింది.
విషయాన్ని స్వయంగా ఏపీ బీజేపీ సహ ఇంచార్జ్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ కూడా ధ్రువీకరించారు. తమ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. పార్టీ కార్యకర్తలు తిరుపతిలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. అయితే.. సోము వీర్రాజు మాత్రం నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఉద్దేశించి ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కాగా, ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లలో బీజేపీ నేతలు తలమునకలయ్యారు. కీలక నేతలను ఇక్కడ నుంచి ప్రచారం చేయించేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలోనే సోము వీర్రాజు ఎస్సీ సామాజిక వర్గంతో పాటు వెనుకబడిన తరగతులకు చెందిన కీలక నేతలతోనూ ఆయన సమేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానికంగా బలమైన నాయకుతోనూ సోము సమావేశమై.. చర్చించి, ఎన్నికల్లో మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఇదిలావుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మికే మరోసారి చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates