ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం కనిపించడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. సమాజంలో ప్రాతమికంగా.. నాలుగు వర్గాలు ఉంటాయి. పేదలు, సాధారణ ప్రజలు, మధ్యతరగతి, ఉన్నతస్థాయి వర్గం. వీరిలో రాజకీయాలకు.. రాజకీయ నేతలకు.. పేదలు, సాధారణ ప్రజలు అత్యంత కీలకం. వీరిని సెంట్రిక్‌గా చేసుకునే నాయకులు, పార్టీలు కూడా వ్యవహరిస్తాయి.
గతంలో వైసీపీ పేదలను, సాధారణ ప్రజలను కేంద్రంగా చేసుకుని.. సంక్షేమ బాటను ఎంచుకుంది. తద్వారా బటన్ నొక్కిపేదల ఖాతాల్లోకి నిధులను జమ చేసింది. సాధారణ ప్రజలకు ఫీజు రీయింబర్స్ మెంటు పథకాలను అమలు చేసింది. జగనన్న ఇళ్లను తీసుకువచ్చింది.(ఇవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందలేదు) ఇక, మధ్య తరగతి ప్రజలు ఆశించే రహదారుల నిర్మాణం.. అభివృద్ధి వంటివాటిని అటకెక్కించింది. ఇక, నాలుగో వర్గంగా ఉన్న ఉన్నతస్థాయి పారిశ్రామిక, సినీ రంగాలకు చుక్కలు చూపించిందనే వాదన ఉంది.
దీంతో 2024 ఎన్నికల్లో ఉన్నత, మధ్యతరగతివర్గాలు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. ఇక, పేదలు.. సాధారణ ప్రజలు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సహా పింఛన్ల పెంపుపై ఆశలు పెట్టుకుని 20 శాతం నుంచి 30 శాతం వరకు చీలిపోయారు. దీంతో వైసీపీ పట్టుతప్పి.. పల్టీ కొట్టింది. ఇక, ఇప్పుడు తిరిగి అదే పేదలు.. సాధారణ ప్రజలపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. కానీ.. ప్రస్తుతం ఆ వర్గాలు కూడా దూరంగానే ఉన్నట్టు ఆన్‌లైన్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
పేదలకు గతంలో వైసీపీ ఇచ్చినట్టుగానే.. ప్రస్తుత కూటమి సర్కారు కూడా.. పథకాలను అమలు చేస్తోంది. పింఛన్లు పెంచడంతోపాటు.. నెల నెలా 1నే వాటిని అందిస్తోంది. ఇక, సూపర్ సిక్స్ పథకాలను ఠంచనుగా అమలు చేస్తోంది (ఒకటి తప్ప). అలాగే.. మధ్యతరగతి ప్రజలను మురిపించేలా రహదారుల బాగుచేతతోపాటు ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పనల కోసం.. పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలానే.. తాజాగా టిడ్కో ఇళ్లను లక్షలాది మందికి అందిస్తోంది. ఇక, ఉన్నతస్థాయి వర్గాల కోసం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలా.. సమాజంలోని నాలుగు వర్గాలను కూటమి సంతృప్తిపరుస్తోంది. తద్వారా.. వైసీపీకి ఎటు చూసినా.. ఛాన్స్ కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates