కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, దీనికి సంబంధించి నియమించిన పీసీ ఘోష్ నివేదిక అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో నిన్న స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సహా బీఆర్ ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో కాసులు మేసిందెవరో.. లక్షల కోట్లు దండుకున్నదెవరో నివేదిక స్పష్టం చేసిందన్నారు. దీనిపై సీబీసీఐడీ వేస్తామని అంటే.. బీజేపీ నాయకులే(కిషన్ రెడ్డి) సీబీఐకి ఇస్తే.. వేగంగా విచారణ పూర్తవుతుందన్నారని.. సీబీఐకి ఇచ్చామన్నారు.
కానీ.. నెలలు గడుస్తున్నా.. సీబీఐ విచారణే ఇంకా ప్రారంభం కాలేదని రేవంత్ చెప్పారు. దీనిని బట్టి ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో అర్ధం అవుతుందని విమర్శించారు. కాళేశ్వరంలో అన్ని విషయాలపైనా అప్పటి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు రీ-డిజైనింగ్ నుంచి బ్యారేజీల నిర్మాణం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయన తెలిపారు. ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చింది కూడా కేసీఆరేనని చెప్పారు.
అలాంటప్పుడు.. అధికారులను బాధ్యులను చేసి.. కేసీఆర్ తప్పుకొంటానంటే కుదురుతుందా? అని సీఎం ప్రశ్నించారు. అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ.. బీఆర్ ఎస్ నేతపైనా.. దీనికి సహకరించిన హరీష్‌రావుపైనా చర్యలు తీసుకునేందుకు.. కనీసం విచారణ చేసేందుకు కూడా కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులకు ఏమాత్రం బాధ్యత ఉన్నా.. కేసీఆర్.. అప్పటి జలవనరుల మంత్రి హరీష్‌రావును జైల్లో పెట్టిన తర్వాతే మాట్లాడాలని రేవంత్ వ్యాఖ్యానించారు.
నా పాత్ర ఉంటే..
కాళేశ్వరం అవినీతిలో ఎవరికి భాగస్వామ్యం ఉన్నా వదలవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సీబీఐ విచారణలో తన పాత్రకానీ.. తన కుటుంబం పాత్రకానీ.. ఉంటే.. దానికి కూడా వెనుకాడవద్దని చెప్పారు. లక్షల కోట్ల ప్రజల సంపదను సొంతం చేసుకుని.. ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు.. విమర్శలతో కాలం వెళ్లదీస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంపదను నాశనం చేసిన వారు ఎవరైనా సరే.. వారు ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates