అమరావతి అగ్నిప్రమాదం వెనుక అసలు నిజం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రాజధాని పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో… రాయపూడి సమీపంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి.

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా… ఈ ఘటన వెనుక రాజధానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఈ మంటలకు కారణం కావచ్చన్న వాదనలు వినిపించాయి. అయితే సదరు పైపులకు కాపలా ఉన్న వాచ్ మన్ తనకు సెలవు ఇవ్వని కారణంగా వాటికి నిప్పు పెట్టినట్టుగా తాజాగా తేలింది. ఈ మేరకు నిందితుడిని విచారించిన పోలీసులు బాధితుడి నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.

రాజధాని నిర్మాణ పనుల్లో మేఘా ఇంజినీరింగ్ సంస్థ కూడా పాలుపంచుకుంటోంది. పనుల్లో వినియోగించే పైపులను ముందుగానే పని ప్రదేశానికి తరలించిన ఆ సంస్థ… వాటికి కాపలాగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది. బెండపూడికి చెందిన రాము ఈ విధుల్లో ఉన్నాడు. అయితే ఈ నెల 23న తన బంధువులొకరు మరణించారని, సెలవు కావాలని కోరగా… అందుకు సూపర్ వైజర్ అంగీకరించలేదట.

దీంతో కోపం పెంచుకున్న రాము… ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఇంటికెళ్లేందుకు సిద్ధపడగా.. రాత్రి కూడా డ్యూటీ చేయాలని చెప్పడంతో అతడు మరింత ఆగ్రహానికి గురై ఏదో ఒకటి చేసి అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ సంఖ్యను పెంచేలా చేయాలని తలచాడు.

ముందుగానే డీజిల్ ను ఓ సీసాలో నింపుకుని పైపుల వద్దకు కాపలా వెళ్లిన రాము…రాత్రి 10.30 గంటలకు పైపులకు నిప్పు పెట్టాడు. అయితే మంటలను చూసి భయపడ్డ రాము… వాటిని ఆర్పేందుకు యత్నించాడు. ఎంతకీ మంటలు అదుపులోకి రావడంతో అతడే సూపర్ వైజర్ కు ప్రమాదం గురించిన విషయాన్ని చెప్పాడు.

ముందుగా 9.30 గంటల సమయంలో అంతా బాగున్నట్లు ఫొటో పెట్టిన రాము… 10.35 గంటల సమయంలో మంటలు చెలరేగుతున్న ఫొటోను పంపాడు. అయితే తానే ఈ మంటలకు కారణమన్న విషయాన్నిదాచాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా…రాము ఎట్టకేలకు తానే అగ్గి రాజేసినట్లు ఒప్పుకున్నాడు.