విలేజి క్లినిక్కులపై జగన్ దృష్టి

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఆరోగ్యం అందించేందుకు విలేజ్ క్లినిక్కుల ఏర్పాటు ఒక్కటే మార్గమని జగన్మోహన్ రెడ్డి భావించారు. ప్రతి మండలంలోను రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఏర్పాటు చేయాలని జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతీ పీహెచ్సీలోను ఇద్దరు డాక్టర్లుండాలని వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి, కమీషనర్ కు స్పష్టంగా చెప్పారు. వంతుల వారీగా పీహెచ్సీలోని డాక్టర్లు రెగ్యులర్ గా గ్రామాలకు వెళ్ళి ప్రజారోగ్యంపై వాకాబు చేయాలన్నారు. అవసరమైన వారికి వీలున్నంతలో వారి ఇళ్ళల్లోనే వైద్యం అందించాలన్నది తన ఆలోచనగా తెలిపారు.

డాక్టర్ గ్రామాల్లో తిరుగుతున్నపుడు వారితో పాటు ఏఎన్ఎం, ఆశావర్కర్లు కూడా ఉండాలన్నారు. ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఎలాగూ గ్రామాల్లోనే తిరుగుతు ప్రజలతో సన్నిహిత సంబంధాలుండటం వల్ల ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యపరిస్దితిపై అవగాహన ఉంటుందన్నారు. ఈ బృందంతో పాటు 104 వాహనం కూడా తీసుకెళ్ళాలన్నారు. అవసరమైన వారిని వెంటనే వాహనంలో పీహెచ్సీకి తరలించి వైద్యం చేయించాలని జగన్ చెప్పారు.

నిజానికి పీహెచ్సీల ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం కూడా గ్రామీణప్రాంతాల్లోని జనాల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలనే. కానీ చాలామంది డాక్టర్లు పెద్దగా పీహెచ్సీలో ఉండరన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ డాక్టర్లున్నా అవసరమైన మందులుండవు. ఇటువంటి అనేక సమస్యల కారణంగా ప్రజలకు పీహెచ్సీలపై నమ్మకం పోయింది. అయితే ప్రజల నమ్మకాన్ని సంపాదించాలంటే పీహెచ్సీలను బలోపేతం చేయటం ఒకటే మార్గమని జగన్ భావించారు. అందుకనే పీహెచ్సీల్లో డాక్టర్లు, నర్సుల భర్తీతో పాటు మందుల స్టాక్ పై జగన్ గట్టి దృష్టిపెట్టారు.

అవసరమైన వ్యైద్యులు, స్టాఫ్ తో పాటు మందుల కొనుగోలు తదితరాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయంలో స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తయారుచేసి తనకు అందించాలని జగన్ ఆదేశించారు. జగన్ ఆదేశాలు గనుక అనుకున్నది అనుకున్నట్లు అమలైతే తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి వైద్యం అందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకనే విలేజ్ క్లినిక్కుల ఏర్పాటుపై జగన్ అంత గట్టిగా దృష్టిపెట్టారు. మరి ఏమవుతుందో చూడాల్సిందే.