మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొంతకాలంగా సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఊహాగానాలకు తగ్గట్లుగానే జీవన్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఆ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. జగిత్యాలలో ఈ రోజు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన రాజీనామా ను జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవమానాలు, అన్యాయంపై ఇంకెన్నాళ్లు ఓపిక పట్టాలి అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పక్క పార్టీకి రాజీనామా చేయకుండానే పది మందిని చేర్చుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
అభివృద్ధిలో ఇతర పార్టీల నేతలు కలిసి వస్తే పరవాలేదని, కానీ, పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ వేలు పెడితే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న పది సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఒంటరి పోరాటం చేశానని, తాను మంత్రి పదవికి అర్హుడిని కాదా అని ప్రశ్నించారు.
గతంలో చంద్రబాబు, కేసీఆర్ లపై పోరాటం చేసిన తాను ఇకపై రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదగకూడదని రేవంత్ తన వంటివారిని అవమానిస్తున్నారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడిచే తనవంటి నేతను అణగదొక్కుతారా అని నిలదీశారు. తన అనుచరుడిని నడిరోడ్డుపై హత్య చేసినా సహించాలా అని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
