ఈ ఏడాది డిసెంబరు 31తో ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం ముగియబోతోన్న సంగతి తెలిసిందే. దీంతో, కొత్త సీఎస్ రేసులో పలువురు ఐఏఎస్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు సీఎస్ పదవి దక్కుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ ను జగన్ సర్కార్ నియమించింది. ప్రస్తుత సీఎస్ సాహ్నీ స్థానంలో ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మరోవైపు, సీఎస్ సాహ్నికి సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారు. సాహ్నిని సీఎం ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాహ్నికి క్యాబినెట్ మంత్రి హోదా కల్పించనున్నారు. ఆరోగ్యం, కొవిడ్ మేనేజ్ మెంట్, రాష్ట్ర-కేంద్ర సంబంధాలు, విభజన అంశాలు, పాలనా పరమైన సంస్కరణలు వంటి అంశాలను సాహ్ని పర్యవేక్షించనున్నారు. వాస్తవానికి జూన్ 30తో నీలం సాహ్ని పదవీకాలం ముగియాల్సి ఉన్నప్పటికీ….కరోనా నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని డిసెంబరు 31వరకు కేంద్రం అనుమతితో పొడిగించిన సంగతి తెలిసిందే.
జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్‌ను సీఎస్ గా నియమించేందుకు జగన్ మొగ్గు చూపారు. వాస్తవానికి నీలం సాహ్ని తర్వాత సీనియార్టీలో ఆమె భర్త అజయ్ సాహ్ని, సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అభయ్ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తుండగా, సతీష్‌చంద్ర చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. జేఎస్వీ ప్రసాద్‌వైపు జగన్ మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.
ఇక, నీరబ్ కుమార్ సీఎస్ రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే, 2024 జూన్ వరకూ ఆయన పదవీకాలం ఉండడంతో వేరేవారికి అవకాశం ఇవ్వాలని జగన్ అనుకున్నారట. దీంతో, 2021 జూన్‌లో పదవీ విరమణ చేయనున్న ఆదిత్యనాథ్ వైపు జగన్ మొగ్గుచూపారని తెలుస్తోంది. అదీగాక, గతంలో జగన్ కేసుల విచారణ సమయంలో ఆదిత్యనాధ్ కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆదిత్యనాధ్ కు జగన్ ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates