కరోనా నేపథ్యంలో దేశంలో ఆంక్షలు అమలువుతున్న వేళ… వలస కార్మికులు ఎక్కడికక్కడే చిక్కుబడిపోయారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోవడంతో వారందరినీ వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఏపీకి చెందిన వలస కార్మికులు ఎందరెన్నారు? ఎక్కడెక్క చిక్కుబడిపోయారు? వారందరినీ రాష్ట్రానికి తరలిస్తే పరిస్థితి ఏమిటి? వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వనున్నారు? అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ వివరాలన్నింటిపైనా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఇప్పుడు ఫుల్ డిటైల్స్ వెల్లడించారు,
ఆళ్ల నాని లెక్కల ప్రకారం… ఏపీకి చెందిన 2 లక్షల మంది కార్మికులు 14 రాష్ట్రాల్లో ఉన్నారట. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన 12,794 మంది వలస కార్మికులు ఏపీలో ఉన్నారట. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీ వలస కార్మికులను రాష్ట్రానికి తరలింపునకు కూడా చర్యలు షురూ చేశారట.
మొదటి దశలోనే రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను ఏపీకి తరలిస్తామని.. రెండో దశలో విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులను తరలిస్తామని ఆళ్ల నాని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి 9 రైళ్ల ద్వారా రాష్ట్రానికి చెందిన కూలీలను తీసుకొస్తామని వివరించారు.
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను రాష్ట్రానికి తీసుకొచ్చిన వెంటనే వారందరినీ నేరుగా క్వారంటైన్ కే తరలిస్తామని నాని చెప్పుకొచ్చారు. ఇందుకోసం గ్రామ సచివాలయంలో ఒకటి చొప్పున లక్ష పడకలతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని నాని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చే లోపు క్వారంటైన్ సెంటర్లను సిద్ధం చేస్తామని తెలిపారు.
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నచోట 500 ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యావసర సరుకులను విక్రయిస్తామని చెప్పారు. అలాగే కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల ఇంటికి ఒకరికి చొప్పున పాస్ ఇస్తామని ఆళ్ల నాని స్పష్టం చేశారు.
ఇక ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ వలస కార్మికులను వారి సొంతూళ్లకు తీసుకువచ్చేందుకు పక్కాగానే ఏర్పాట్లు చేస్తున్నామని కూడా నాని వివరించారు. వలస కార్మికుల కోసం Spandana.ap.gov.in పేరిట ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ను రూపొందించామని, ఈ వెబ్ సైట్ లో కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి రావాలనుకునే వలస కూలీలు వెబ్సైట్, మెయిల్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ప్రాంతం, వెళ్లాలనుకునే ప్రాంతం వెబ్సైట్లో స్పష్టంగా తెలియజేయాలని ఆయన సూచించారు.