రాజ‌ధాని రైతుల‌కు ట్రైనింగ్‌.. దేనికో తెలుసా?

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో టీడీపీ అధినేత ఎంత‌గా పోరాడుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. న‌వ్యాంధ్ర‌కు ప్ర‌త్యేక గుర్తింపు, అతి పెద్ద రాజ‌ధాని ఉండాల‌నే సత్సంక‌ల్పంతో చంద్ర‌బాబు తీసుకున్న‌నిర్ణ‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ స్వాగ‌తించారు. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని విష‌యంలో రాష్ట్రంలోని వారే కాకుండా ప్ర‌వాసాంధ్రులు కూడా ఎంతో ఆశ పెట్టుకున్నారు. స‌న్‌రైజ్‌స్టేట్‌కు స‌రైన రాజ‌ధాని అంటూ పొంగిపోయారు. అయితే.. ఇప్పుడు ఇది యూట‌ర్న్ తీసుకుంది. దీంతో రాజ‌ధానిని నిల‌బెట్టుకునేందుకు చంద్ర‌బాబు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉద్య‌మాన్ని భారీ రేంజ్‌లో ముందుకు సాగేలా చేస్తున్నారు.

ఇక‌, త్వ‌ర‌లోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌లో అమ‌రావ‌తి అంశా న్ని కీల‌కంగా మార్చాల‌ని చంద్ర‌బాబు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. రాజ‌ధానివిష‌యం ఎప్పుడైతే.. తెర‌మీదికి వ‌చ్చిందో ఆయ‌న అప్ప‌టి నుంచి ప్ర‌భుత్వానికి స‌వాల్‌రువ్వుతున్నారు. ఇటీవ‌ల కూడా మీరు మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌తో రండి.. నేరు ఒక రాజ‌ధాని అమ‌రావ‌తి ప్ర‌క‌ట‌న‌తో వ‌స్తాను ఎన్నిక‌ల‌కు వెళ్దామ‌ని పిలుపునిచ్చారు. అంతేకాదు.. తాను ఓడితే.. రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకొంటాన‌ని స‌వాల్ రువ్వారు. అయితే, దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. ఇదిలావుంటే.. చంద్ర‌బాబు మాత్రం త‌న ప్ర‌య‌త్నాన్ని మ‌రింత తీవ్రం చేశారు.

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న తిరుప‌తి ఉప ఎన్నిక‌లో అమ‌రావ‌తి అంశాన్ని ఒక అజెండాగా ముందుకు తీసుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. వాస్త‌వానికి దీనినే ప్ర‌ధాన అజెండా అనుకున్నా.. త‌ర్వాత అనేక విష‌యాలు ఉండ‌డంతో వాటికి కూడా స్థానం క‌ల్పించారు. ఇక, అమ‌రావ‌తి గురించి తాను ప్ర‌చారం చేసే క‌న్నా.. కూడా.. రాజ‌ధాని ప్రాంతానికి చెందిన రైతుల‌తో నే ప్ర‌చారం చేయించ‌డం స‌రైన నిర్ణ‌యంగా భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎంపిక చేసుకున్న కొంద‌రు మ‌హిళా రైతులు, రైతులకు విజ‌య‌వాడ‌లోని అమ‌రావ‌తి జేఏసీ కార్యాల‌యంలో శిక్ష‌ణ ఇస్తున్న‌ట్టు తెలిసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఓ ఐదు నిముషాలు ప‌ది నిముషాలు మాట్లాడ‌డం త‌ప్ప‌.. పెద్ద‌గా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌ని వీరికి .. ఎన్నిక‌ల ప్ర‌చారంలో అవ‌స‌ర‌మైతే.. అర‌గంట అయినా.. మాట్లాడేలా శిక్ష‌ణ ఇస్తున్నారు. అమ‌రావ‌తికి తాము చేసిన త్యాగాలు, జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంబిస్తున్న తీరుతో ఎదురుకానున్న క‌ష్టాలు, న‌ష్టాలు, ఉద్య‌మం సాగిన విధానం.. రాజ‌ధాని అస‌వ‌రం.. వంటి అనేక విష‌యాల‌ను వారు ప్ర‌ధానంగా తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ప‌ది మంది వ‌ర‌కు శిక్ష‌ణ పొందుతున్నారు. వీరిలో ఎస్సీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఉన్నార‌ని తెలిసింది. మ‌రి ఈ వ్యూహం ఫ‌లిస్తుందా? లేదా? చూడాలి.