మిత్రపక్షాల మధ్య ‘తిరుపతి’ చిచ్చు

మొత్తానికి తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక మిత్రపక్షాల మధ్య పెద్ద చిచ్చుపెట్టటం ఖాయమనే అనుమానంగా ఉంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేయబోయేది జనసేన అభ్యర్ధే అని అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం ఊపందుకుంది. లోక్ సభ ఉపఎన్నికల కోసం పవన్ నియమించిన సమన్వయ కమిటి తన పర్యటనను పూర్తి చేసిందట. తర్వాత సభ్యులంతా కలిసి తయారు చేసిన నివేదికను పవన్ కు అందించారని సమాచారం.

నివేదికలోని అంశాలను పరిశీలించిన తర్వాత ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి కన్నా జనసేన అభ్యర్ధి పోటీ చేస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అందుకనే ఉపఎన్నికల్లో మన పార్టీ అభ్యర్ధే పోటీ చేస్తారని పార్టీలోని ముఖ్యనేతలకు పవన్ నుండి వరుసగా సమాచారం అందుతోందట. బీజేపీనే పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన ఏకపక్షమని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు.

ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేస్తాడనే విషయం నిర్ణయించాల్సింది ఢిల్లీ నాయకత్వమే కానీ వీర్రాజు కాదంటూ జనసేన కీలక నేత కిరణ్ రాయల్ ప్రకటించటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికలో బీజేపీకి నోటాకన్నా తక్కువ ఓట్లు పోలైన విషయాన్ని కూడా కిరణ్ ప్రస్తావించారు. ప్రత్యేకహోదా విషయంలో 2014 ఎన్నికల్లో నరేంద్రమోడి హామీ ఇచ్చి తప్పడం, తిరుపతి అభివృద్ధి అంతా తాము చేసిందే అని చెప్పుకుంటున్న వీర్రాజు మాటల్లోని డొల్లతనం అందరికీ తెలుసని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు.

మొత్తానికి తిరుపతి ఉపఎన్నిక రెండు పార్టీల మద్య పెద్ద చిచ్చు పెట్టే అవకాశమే ఉందని అనుకుంటున్నారు. వీర్రాజు తొందరపాటు ప్రకటనలు చేస్తున్నట్లు కమలం పార్టీ నేతల్లోనే ఆందోళనలు మొదలయ్యాయి. తిరుపతి ఉపఎన్నిక విషయంలో రెండుపార్టీలతో ఓ కమిటిని వేస్తామని స్వయంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే చెప్పిన విషయాన్ని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. ఓవైపు నడ్డా ప్రకటన చేసిన కొద్దిరోజులకే బీజేపీనే పోటీ చేస్తుందని వీర్రాజు ప్రకటించటాన్ని రెండుపార్టీల్లోని నేతలు ఆక్షేపిస్తున్నారు. మరి ఉపఎన్నికలో చివరకు ఏపార్టీ అభ్యర్ధి పోటీ చేస్తారనే ఉత్కఠ మాత్రం పెరిగిపోతోంది.