దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ.. తొలిసారి పిల్లి మొగ్గలు వేస్తున్నారా? రైతుల విషయంలో ఆదిలో ఉన్న పట్టు-బిగువును దాదాపు సడలించేశారా? ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? ఏ విధంగా రైతులను ఒప్పించాలి? అనే ప్రశ్నలు జాతీయ స్తాయిలో తెరమీదకు వచ్చాయి. కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ.. పలు కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రధానంగా నోట్ల రద్దు దేశాన్ని కుదిపేసింది. దీనిని ఆర్థిక ప్రధాన సంస్కరణగా అప్పట్లో బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. అయితే.. నోట్ల రద్దు కారణంగా.. చిన్న చితకా పరిశ్రమలు మూలనబడ్డాయి. అంతేకాదు.. కొత్త పరిశ్రమల ఏర్పాటు కూడా సాధ్యం కాలేదు. ఇది ఒకరకంగా మైనస్సే అయినా.. మోడీ పెద్దగా ఆవేదన చెందలేదు. ప్రజలకు పడి పడి దణ్నాలు పెట్టలేదు.
మరో కీలక సంస్కరణగా జీఎస్టీ తీసుకువచ్చారు. ఇది రాష్ట్రాల ఆదాయాన్ని హరించి వేస్తుందని.. పేర్కొంటూ.. కొన్ని రాష్ట్రాలు యుద్ధమే చేశాయి. అయినా.. మోడీ వెనక్కి తగ్గలేదు. దీనిపై పెద్దగా ఆయన రంగంలోకి దిగిపోయి.. రాష్ట్రాలను బ్రతిమాలుకున్నది కూడా లేదు. కానీ, ఇప్పుడు తీసుకున్న వ్యవసాయ సంస్కరణల వ్యూహం మాత్రం మోడీని తీవ్రంగా ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తోందనడంలో సందేహం లేదు. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన మోడీకి.. రైతుల నుంచి తీవ్రస్థాయిలో సెగ తగులుతోంది. పంజాబ్, హరియాణా, యూపీ సహా పలు రాష్ట్రాల నుంచి రైతులు.. ఢిల్లీకి చేరువలో ఉద్యమం చేస్తున్నారు. దాదాపు 20 రోజులుగా వారు ఎముకలు కొరుకుతున్న చలిని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
సదరు వ్యవసాయ చట్టాలను ఎట్టిపరిస్థితిలోనూ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, నరేంద్ర మోడీ మాత్రం ఆదిలో ఈ ఉద్యమాన్ని లైట్ తీసుకున్నారు. కొన్నాళ్లకు బలప్రయోగంతో అణిచి వేయాలని చూశారు. కానీ, రైతులు భీష్మించారు. ఇక, అన్నదాతలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల నుంచి మద్దతు లభించింది. దేశంలోనూ అన్ని రాష్ట్రాల ప్రజలు మద్దతు తెలిపారు. ఇటీవల జరిగిన భారత్ బంద్‌కు మద్దతు ఇచ్చారు. ఈ పరిణామాలతో మరో మెట్టు దిగిన కేంద్ర ప్రభుత్వం.. చర్చలు జరిపింది. ఇవి ఫలించలేదు. చట్టాల్లో సవరణలు తెస్తామని, మద్దతు ధరకు భరోసా ఇస్తామని చెబుతున్నా.. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు.
దీంతో మోడీనే నేరుగా రంగంలోకి దిగారు. వ్యవసాయ మంత్రి తోమర్‌ను కూడా బరిలోకి దింపారు. కేవలం ఒక్క రాష్ట్రంలోనే ఉద్యమం ఉందని చెప్పించారు. అయినా.. ఆ పాచిక పారలేదు. దీంతో ప్రజలకు పడిపడి దణ్ణాలు పెడుతున్నారు. మేం మద్దతు ధరలకు మద్దతు ఇస్తామని.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు పెద్దపీట వేయడమే తమ దృష్టికి నిదర్శనమని.. రైతులను ఒప్పించేందుకు ప్రయాసపడుతుండడం నిజంగా ప్రధాని మోడీ పాలనలో తొలిసారి.. ఇన్ని మెట్లు దిగిన ఘట్టానికి పరాకాష్టగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్ని రోజులు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఉగ్రవాదుల ప్రమేయం ఉందని కూడా వ్యాఖ్యానించిన కేంద్రం పెద్దలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ప్రధాని చేసే ప్రసంగాలను దేశంలోని అన్ని భాషల్లోనూ అనువదించి యథాతథంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు గమనిస్తే.. త్వరలోనే జరగనున్న తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా.. ప్రధానిగా మోదీ.. ఇన్ని మెట్లు దిగడం ఇదే ప్రథమం అంటున్నారు పరిశీలకులు.