పీకే సంచలన ట్వీట్

పీకే అనగానే మనకు పవన్ కళ్యాణే గుర్తుకొస్తాడు కానీ.. జాతీయ స్థాయిలో అయితే ఆ పేరుతో పాపులరైన వ్యక్తి మరొకరున్నారు. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. తనదైన వ్యూహ చతురతతో, ప్లానింగ్‌తో రాజకీయ ముఖచిత్రాలు మార్చేయగల నిపుణుడిగా ప్రశాంత్‌కు పేరుంది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ భారీ విజయం సాధించడంలో ప్రశాంత్ టీమ్ పాత్ర కీలకమన్న సంగతి తెలిసిందే.

బీహార్‌కు చెందిన ఈయన తన సొంత రాష్ట్రంలోనే కాక వేరే ప్రాంతాల్లోనూ రాజకీయ పార్టీలను వెనుకుండి నడిపించి సంచలన ఫలితాలు రాబట్టారు. ఎప్పుడూ ఉండేది తెర వెనుకే కానీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం ప్రశాంత్‌కు ఉన్న గుర్తింపే వేరు. ఆయన వ్యాఖ్యలు, సోషల్ మీడియా స్టేట్మెంట్లకు మీడియా మంచి ప్రాధాన్యం ఇస్తుంది.

తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ఫలితాలపై ప్రశాంత్ చెబుతున్న జోస్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా బలపడిందని, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు షాకిచ్చి అధికారంలోకి రాబోతోందని విశ్లేషకులు అంటుండగా.. దానికి పూర్తి భిన్నంగా ప్రశాంత్ ట్వీట్ వేశారు. బెంగాల్‌లో బీజేపీ బలం గురించి ఊరికే హైప్ మాత్రమే నడుస్తోందని.. వాస్తవానికి వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని, ఆ పార్టీ సీట్లు డబుల్ డిజిట్ కూడా చేరవని ప్రశాంత్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.

తన అంచనా తప్పితే ఈ చోటు నుంచి తప్పుకుంటా అంటూ తాను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతాననే సంకేతాలు ఇచ్చాడు పీకే. ఐతే బెంగాల్‌లో రాజకీయ వాతావరణం చూస్తే మాత్రం మమతకు బీజేపీ నుంచి సవాలు తప్పదనే అనిపిస్తోంది. మరి పీకే ఇంత దూకుడుగా స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడో?