ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు భారీ ఎత్తున సంబ రాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో తప్పులేదు. అయితే, దీనికి సంబంధించి అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా వినియోగించుకోవడమే ఇప్పుడు ఇబ్బందిగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందు కు వైసీపీ నాయకులు రెండు రోజులుగా తీరిక లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ల ను, కిందిస్థాయి వీఆర్ వో, వీఆర్ ఏలను కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేశారు.
దీంతో ఆయా అధికారులు చేయాల్సిన పనులు నిలిచిపోయాయి. శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులే కదా.. మీరు వచ్చి మాకు సహకరించాలి.. అని కొందరు మంత్రులే మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో సదరు అధికారులు మంత్రులు చెప్పినట్టు ఏర్పాట్లలో మునిగితేలారు.
కానీ, ప్రభుత్వం నిర్దేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న అమ్మ ఒడి, నాడు-నేడు, భూముల సమగ్ర సర్వే.. వంటి కార్యక్రమాల్లో వారు సెలవు రోజుల్లోనూ బిజీగానే ఉంటున్నారు. అయినా కూడా మంత్రుల ఆదేశాలతో అధికారులు అదికారిక విధులు పక్కన పెట్టి మరీ వైసీపీ నేతల కార్యక్రమాలకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పుట్టిన రోజులు చేసుకున్నారని, కానీ, ఈ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండగగా నిర్వహించడం ఇదే ప్రారంభమని పేర్కొంటున్నారు. అంతేకాదు, పైకి చెప్పకపో యినా.. ప్రభుత్వ నిధులను కూడా మళ్లిస్తున్నారా? అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం కావడం గమనార్హం.
అంతేకాదు.. అధికారిక విధుల నుంచి అధికారులను తప్పించి పార్టీ కార్యక్రమాలు, సీఎం పుట్టిన రోజు వేడుకలకు వినియోగించుకోవడం సరికాదని.. ఇది మంచి సంకేతాలు ఇవ్వదని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్ సంపాయించుకున్న క్రెడిట్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినా.. కూడా వైసీపీ నాయకులు వినిపించుకోకపోవడం గమనార్హం.