రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యను రాజకీయం చేయదల్చుకోలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టినప్పుడు.. తాను అడ్డుకోకపోవడానికి కారణం ఇదేనని తెలిపారు. అప్పట్లో చాలా మంది దీనిపై తనను రెచ్చగొట్టేలా ప్రయత్నించారని.. కానీ, అన్నీ ఆలోచించే ఆనాడు తాను అడ్డు చెప్పలేదన్నారు. దీనివల్ల తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు.
అదేవిధంగా ఇప్పుడు పోలవరం-మల్లన్న సాగర్ ప్రాజెక్టును చేపట్టామని.. దీనిని పూర్తి చేయడం ద్వారా సీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కానీ.. దీనిని అర్ధం చేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. నదుల అనుసంధానం జరిగితే.. రాష్ట్రాలకు, దేశానికి కూడా ప్రయోజనం ఉంటుందని.. తద్వారా వ్యవసాయం మరింత పుంజుకుంటుందని చెప్పారు. అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు.. నీటి వనరుల పరిరక్షణపై మాట్లాడారు.
గంగా- కావేరి నదుల అనుసంధానం కావాలనేది తన ప్రగాఢ ఆకాంక్షగా చంద్రబాబు చెప్పారు. దీనికి గతంలోనే తాను రోడ్ మ్యాప్ రూపొందించానని.. కానీ, సాకారం కాలేదన్నారు. కావేరీ నది జలాల కోసం రెండు రాష్ట్రాల మధ్య యుద్ధం(తమిళనాడు-కర్నాటక) జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ, నదుల అనుసంధానం జరిగితే.. ఈ తరహా ఉద్రిక్తతలు ఉండబోవని.. అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు.
ఉమ్మడి సహా ప్రస్తుత ఏపీలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే జరిగాయని చంద్రబాబు చెప్పారు. పట్టిసీమ నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణాకు తీసుకొచ్చామన్నారు.
“కొందరు(వైసీపీ) ప్రాజెక్టులు కూడా పూర్తికాకుండానే.. రిబ్బన్ కటింగులు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో.. ప్రజలే వారిని నిలదీయాలి“ అని వ్యాఖ్యానించారు. వెలిగొండను పూర్తిచేసే బాధ్యతను తాను తీసుకున్నట్టు చెప్పారు. పోలవరం మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates