‘వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు’

మాజీ మంత్రి కొండా సురేఖ కొన్ని సందర్భాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ లపై సురేఖ చేసిన కామెంట్లు గతంలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ కామెంట్లపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో నాగార్జున కేసు వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈసారి సురేఖ రాజకీయ నాయకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని, అయినా సరే నేతలు చెప్పినట్లు ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వినాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కొండా సురేఖ ఈ కామెంట్స్ చేశారు. ఎంతో కష్టపడితేనే ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అవుతారని, అయినా చివరికి వారు రాజకీయ నాయకుల ముందు నిల్చొని నాయకులు చెప్పింది వినాల్సివస్తుందని అన్నారు.

అయితే, అలా రాజ్యాంగంలో రాసి ఉందని, దానికి మనం ఏమీ చేయలేమని కూడా అన్నారు. పైగా, దీనిని విమర్శగా తీసుకోవద్దని, వివాదం చేయొద్దని కూడా చెప్పారు. ఇది తన మనసులో అభిప్రాయం మాత్రమేనని అన్నారు.

చదువు రాకున్నా, సబ్జెక్ట్ తెలియపోయినా…అధికారులను తాము తిడుతుంటామని వ్యాఖ్యానించారు. అయితే, రూల్స్ ఒప్పుకోని సందర్భంగా అధికారులు కొందరు ఆ పని చేయరని, వారి గురించి తాను మాట్లాడడం లేదని, వారి పని వారిని చేసుకోనివ్వాలని తెలిపారు.

కానీ, రూల్స్ ఒప్పుకున్నా సరే కొందరు తలబిరుసు అధికారులు పనిచేయరని, వారిని అన్నా తప్పులేదని చెప్పారు. ఏది ఏమైనా…అది కొండా సురేఖ మనసులోమాట అయినా…ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.