అసెంబ్లీలో శివరాత్రి వేడుక.. ఒకరోజు ముందే

దేశ‌వ్యాప్తంగా మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు ఆదివారం జ‌ర‌గ‌నున్నాయి. అన్ని శివాల‌యాల్లోనూ ఈ వేడుక‌లు నిర్వ‌హించేందుకు భ‌క్తులు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఏపీ అసెంబ్లీలో ఒక రోజు ముందుగానే మ‌హా శివ‌రాత్రి ముచ్చ‌ట క‌నిపించింది. టీడీపీ స‌హా కూట‌మిలోని అన్ని పార్టీలకు చెందిన మ‌హిళా మంత్రులు, ఎమ్మె ల్యేలు(ఒక‌రిద్ద‌రు మిన‌హా) మ‌హా శివ‌రాత్రిని త‌ల‌పించే వ‌స్త్ర ధార‌ణ‌తో హాజ‌ర‌య్యారు. శివ‌రాత్రి రోజు శివ‌త త్వంతో కూడిన వ‌స్త్రాల‌ను ధ‌రిస్తారు.

అచ్చంగా అలాంటి వ‌స్త్రాల‌నే ధ‌రించిన మ‌హిళా నాయ‌కులు స‌భ‌కు వ‌చ్చారు. బ‌డ్జెట్ ప్ర‌సంగం స‌హా.. ఇత‌ర కార్య‌క్ర‌మాల్లోనూ.. ఆ వ‌స్త్రాల‌తోనే స‌భ‌లో కూర్చున్నారు. మ‌హిళా నేత‌లు.. ముదురు ఎరుపు రంగు బ్లౌజ్‌లు, అదే రంగు బార్డ‌ర్‌తో ఉన్న కాషాయ చీర‌ల‌ను ధ‌రించారు. ఈ రంగును శివ‌త‌త్వానికి ప్ర‌తీక‌గా భావిస్తారు. వీటిని మంగ‌ళ‌గిరిలోని చేనేత కార్మికులు రూపొందించిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. మంత్రి నారా లోకేష్ ఈ చీరల‌ను మ‌హిళ‌ల‌కు కానుక‌గా ఇచ్చారు.

దీంతో అంద‌రూ శ‌నివార‌మే ఈ వ‌స్త్రాల‌ను ధ‌రించి అసెంబ్లీకి రావ‌డంతో ముంద‌స్తు శివ‌రాత్రి వేడుక‌లు నిర్వ‌హించిన‌ట్టుగా అసెంబ్లీ ప్రాంగ‌ణం క‌నిపించింది. వీరు అవే వ‌స్త్ర ధార‌ణ‌ల‌తో సీఎం చంద్ర‌బాబును, మంత్రి నారా లోకేష్‌, స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుల‌ను క‌లుసుకున్నారు. మ‌హా శివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా.. వాస్త‌వానికి ఆదివారం మ‌హా శివ‌రాత్రి కావ‌డంతో ఆ రోజు.. స‌భ‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

దీంతోపాటు సోమ‌వారం కూడా.. స‌భ‌కు సెల‌వు కావ‌డంతో శ‌నివారమే మ‌హిళా నేత‌లు ఇలా శివ‌త‌త్వాన్ని తెలిపే వ‌స్త్రాల‌తో స‌భ‌కు రావ‌డం గ‌మ‌నార్హం. ఇలా.. ఒకే ర‌క‌మైన వ‌స్త్రాలు ధ‌రించి స‌భ‌కురావ‌డం ఇదే తొలిసారి కూడా కావ‌డం మ‌రో విశేషం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ మహిళా నేతలు ఈ విధంగా ప్రత్యేకతను చాటడంపై సీఎం చంద్ర‌బాబు, స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు సంతోషం వ్య‌క్తం చేశారు.