దివంగత వైఎస్సార్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అత్యంత విశ్వాస పాత్రుడు అన్న సంగతి తెలిసిందే. ఆ విశ్వాసాన్ని వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ కు కూడా ఉండవల్లి సందర్భానుసారంగా మద్దతుగా నిలుస్తుంటారు.
కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన చాలామంది నేతలతో ఉండవల్లికి సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ పై ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉండవల్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇళ్లు ధ్వంసం చేసి పెట్రోలు బాంబులతో దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని, తిట్టిన వారిని సెంట్రల్ జైల్ కు పంపారని తన మార్క్ కామెంట్లతో ఉండవల్లి విమర్శలు గుప్పించారు.
కక్షతోనే అంబటి రాంబాబును జైలుకు పంపించారని ఆరోపించారు. అంబటిపై 35 చోట్ల కేసులు పెట్టడం, సెంట్రల్ జైలుకు పంపడం ఇదంతా కొత్త ట్రెండ్ అని, చాలా టూ మచ్ గా వ్యవహరించారని అన్నారు. దానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని,
ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎప్పటి నుంచో అంబటితో పరిచయం ఉందని, అందుకే ములాఖత్ అయ్యేందుకు వచ్చానని అన్నారు. వారం క్రితమే రావాల్సి ఉందని…రాలేకపోయానని చెప్పారు. ఈ కేసు వల్ల అంబటికి, వైసీపీకి లాభం జరిగిందని అన్నారు. 6 గంటల పాటు అంబటి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారని, అంత సీరియస్ కేసులో దాడి చేసిన వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం తాను తొలిసారి వింటున్నానని అన్నారు.
ఇక, ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా ఉండవల్లి స్పందించారు. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ కూడా చెప్పిందని గుర్తు చేశారు. అయినా సరే చంద్రబాబు ఆ వయస్సులో అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.
చంద్రబాబు దైవ ద్రోహం చేస్తున్నాడని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. బాత్రూమ్ లో వాడే కెమికల్స్ ఆ నెయ్యిలో వాడారని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని, చంద్రబాబు ఇలా మాట్లాడడం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. జంతువుల కొవ్వు లేదని సిట్ రిపోర్టులో చెప్పినా…చంద్రబాబును ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మళ్ళీ అన్ని విషయాలు ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా మాట్లాడతానని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates