అమరావతిలో కొత్త వెలుగులు సంతరించుకున్నాయి. గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రానికి శనివారం సాయంత్రం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పాల్గొన్నారు. అనంతరం.. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ దేశానికే `గేమ్ ఛేంజర్` అని వ్యాఖ్యానించారు. సాంకేతిక రంగంలో క్వాంటమ్ వేగం మరిన్ని కొత్త పుంతలు తొక్కేలా చేస్తుందన్నారు. అమరావతి కేంద్రంగా ఏర్పాటవుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ అనేక కీలక మార్పులకు శ్రీకారం చుడుతుందన్నారు.
రాబోయేరోజుల్లో ఇక్కడ నుంచే క్వాంటమ్ ఉత్పత్తులు ఎగుమతి ఎవుతాయని.. తద్వారా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవ కాశాలు కూడా లభిస్తాయని చంద్రబాబు వివరించారు. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు అమరావతికి లభిస్తాయని తెలిపారు. విజన్ ఉంటే ఏదైనా సాకారం అవుతుందన్న సీఎం చంద్రబాబు.. వచ్చే 40 సంవత్సరాల భవితను దృష్టిలో పెట్టుకుని క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని రాజధానిలో నెలకొల్పినట్టు పేర్కొన్నారు. క్వాంటమ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తోందని, ఇది ఏపీ నుంచే ప్రారంభం అవుతుందని తెలిపారు.
పచ్చదనానికి ప్రతీక!
అమరావతి రాజధాని.. పచ్చదనానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ ప్రతి అంగుళంలోనూ పచ్చదనం సాక్షాత్కరించనున్నదని తెలిపారు. దీంతో గాలి నాణ్యత కూడా పెరుగుతుందని.. రాజధాని పరిధిలో నివసించే వారి ఆయుప్రమాణాలు కూడా కొన్ని ఏళ్ల పాటు పెరగనున్నాయని చెప్పారు. రాజధానిలో డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, మెడ్ టెక్, స్పేస్ సిటీ లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇదేసమయంలో ప్రైవేటు కంపెనీలను కూడా సాధ్యమైనంత వేగంగా పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టామన్నారు.
ప్రధానికి ప్రశంసలు..
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు గుప్పించారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకు డు ప్రధానిగా ఉండడం అందరికీ కలిసి వచ్చిన పరిణామంగా పేర్కొన్నారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా.. ప్రధాని ప్రభ వెలుగుతోందన్నారు. కాగా.. ఈ ఏడాది చివరి నాటికి తొలి క్వాంటమ్ కంప్యూటర్ రావాలని.. సీఎం చంద్రబాబు చెప్పారు. 2030లోగా 2.5 లక్షల మంది క్వాంటమ్ నిపుణులు కావాలని నిర్దేశించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
