‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శ‌లు గుప్పించారు. ఆయ‌న‌.. కేసీఆర్ కుటుంబంతో మిలాఖ‌త్ అయ్యార‌ని ఆరోపించారు. కేటీఆర్‌, కేసీఆర్‌ల‌కు ఇప్పుడు ఆత్మ బంధువు ఎవ‌రైనా ఉంటే.. ఆయ‌న కిష‌న్ రెడ్డేన‌ని చెప్పారు.

గంగాపురం కిష‌న్ రెడ్డి ఇప్పుడు.. క‌ల్వ‌కుంట్ల కిష‌న్ రెడ్డి రావుగా మారిపోయార‌ని ఎద్దేవా చేశారు. తాము పెడుతున్న కేసుల‌ను కేంద్రంలో అడ్డుకుని కేసీఆర్ కుటుంబానికి మేలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇంత‌క‌న్నా తెలంగాణ‌కు కిష‌న్ రెడ్డి చేస్తున్న‌ది ఏమీ లేద‌ని ఎద్దేవా చేశారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా వేలాది కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్నివెనుకేసుకున్నార‌ని.. మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శ‌లు గుప్పించారు. అదేవిధంగా ఈ-ఫార్ములా రేస్ ద్వారా కేటీఆర్ అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు.

ఈ కేసుల‌ను తాము ముందుకు తీసుకువెళ్తుంటే.. కిష‌న్ రెడ్డి అడ్డుప‌డుతున్నార‌ని.. వారిని ఆయ‌నే కాపాడుతున్నార‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్‌, కేసీఆర్‌ల‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారో.. కిష‌న్ రెడ్డే చెప్పాల‌ని ప్ర‌శ్నించారు.

దీనితో కిషన్ రెడ్డే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై కిషన్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు కానీ ఇంకా స్పందించలేదు.