టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు తనకు లభించిన అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు. ఏపీకి ఒక రాజధాని మాత్రమే ఉండాలంటూ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో.. అక్కడ ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యేందుకు బాబు వెళ్లారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి..అమరావతి భూమిపూజ జరిగిన చోట చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎందుకంటే.. భూమిపూజ జరిగిన ప్రాంతానికి వెళ్లి.. అక్కడ గుట్టగా పోసిన మట్టి మీద పడుకొని.. సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఇక..భూమిపూజ జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు హైడ్రామా చోటు చేసుకుంది. తొలుత బెజవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న ఆయన.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. దానికి అమ్మ ఆశీస్సులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి అన్నది అందరి కల అని చెప్పిన చంద్రబాబు.. దానిని విధ్వంసం చేస్తున్నారన్నారు.
ఎన్నో విధాలుగా దాడులు చేస్తున్నా.. ఏడాది కాలంగా అమరావతిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి దర్శనం తర్వాత ఉద్దండరాయునిపాలానికి బయలుదేరిన బాబు.. కరకట్ట మీదుగా కాకుండా అమరావతి కోసం ఉద్యమం సాగిన గ్రామాల మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో.. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో టీడీపీ నేతలు చర్చలు జరిపారు. చివరకు పరిమిత సంఖ్యలో వాహనాల్ని అనుమతిస్తామని చెప్పారు. అయితే.. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న వాహనాల్ని పోలీసులు అనుమతించకపోవటంతో గందరగోళం చోటు చేసుకుంది. హైడ్రామా నడుమ శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి చేరుకున్న బాబు.. సాష్టాంగ నమస్కారం చేసి తన మార్కును చూపించే ప్రయత్నం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates