రాజకీయ మాజీ వ్యూహకర్త.. జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఉరఫ్ పీకేను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. బీహార్‌లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి విజయం దక్కించుకుంది. అంతేకాదు.. గతానికి భిన్నంగా ఈ దఫా ఓట్లు, సీట్లు కూడా ఈ కూటమికి పెరిగాయి. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని స్వల్పంగా నిలబెట్టుకుంది. ఎంఐఎం కూడా పలు స్థానాల్లో విజయం దక్కించుకుంది.
ఇక, తొలిసారి రాజకీయ పార్టీ పెట్టి.. దానిని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపిన.. పీకే మాత్రం ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 238 స్థానాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టినా.. ఆయన ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కించుకోలేక పోయారు. ఇక, ఈ ఎన్నికలకు పీకే పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఏదో మతలబు జరిగిందని.. వరుసగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది చాలా అరుదైన ఘటన అని పేర్కొంటూ.. ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలే మీకు ఓటేయలేదని.. గెలిపించలేదని.. ఈవీఎంలతో సంబంధం ఉంటుందని ఎలా ఆరోపిస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. మీకు ఓట్లు పడి.. ఒక్కచోటైనా గెలిచి ఉంటే.. కోర్టుకు వచ్చేవారా? అని ప్రశ్నించారు. కానీ, రాజకీయంగా కోర్టును వినియోగించుకునేందుకు ప్రయత్నించారని పీకేపై కోర్టు మండిపడింది.
న్యాయస్థానాలను రాజకీయ వేదికగా మలుచుకోవడానికి తాము ఎప్పటి పరిస్థితిలోనూ అనుమతించేది లేదన్నారు. కాగా.. ఎన్నికలకు ముందు.. కూటమి నాయకులు.. మహిళకు 10 వేల చొప్పున పంచారని.. ఇది ఎన్నికలను ప్రభావితం చేసినట్టు కాదా? అని పీకే తరఫున న్యాయవాది ప్రశ్నించారు. అయితే.. షెడ్యూల్ రాకముందు ఉన్న పథకాలను కొనసాగించుకునే స్వేచ్ఛ అన్ని ప్రభుత్వాలకూ ఉంటుందన్న ఆయన.. కూటమి గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరలేరని.. ఆ పని తాము చేయబోమని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
