రాజ్యసభలో కమల్ నోట తెలుగు మాట

తమిళ లెజెండరీ నటుడు కమల్ హాసన్.. కొన్నేళ్ల ముందు కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కానీ ఎన్నికల్లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కమల్ పార్టీ ‘మక్కల్ నీది మయం’ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయినా కమల్ ఏమీ పార్టీని మూసేయలేదు. రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు.

తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి ఆయన మద్దతుదారుగా మారారు. ఆ పార్టీనే ఆయన్ని రాజ్యసభకు పంపింది. తాజాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కమల్ పార్లమెంటులో అడుగు పెట్టారు. ఆయన తొలిసారిగా పెద్దల సభలో ప్రసంగించారు. కమల్ తొలి ప్రసంగమే హాట్ టాపిక్‌గా మారింది. నిన్నటి సభలో కమల్ స్పీచే హైలైట్‌గా నిలిచింది.

కమల్ తమిళ భాషాభిమానం గురించి తెలిసిందే. అందుకు తగ్గట్లే ఆయన స్వచ్ఛమైన తమిళంలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కొన్ని నిమిషాల పాటు ఆ భాషలో మాట్లాడాక.. ఆయన తెలుగులోనూ కొన్ని మాటలు చెప్పారు. తనకెంతో ఇష్టమైన శ్రీశ్రీ కవిత ‘జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్ వస్తున్నాయ్’ పంక్తులను ఆయన ప్రస్తావించారు.

దీనికి అర్థమేంటో తెలుగు వాళ్లకు తెలుసు అంటూ ఆయన తెలుగులో మాట్లాడారు. ఆ తర్వాత తన స్పీచ్‌ను ఇంగ్లిష్‌లో కొనసాగించారు కమల్. రేపటి దేశ భవిష్యత్తు బాగుండాలన్నట్లుగా ఆయన ప్రసంగం స్ఫూర్తిదాయకంగా సాగింది.

ఏ ప్రభుత్వం కూడా చిరకాలం తామే ఉంటామని అనుకోకూడదని.. ఆ లక్ష్యంతో సాగకూడదని.. ప్రజాస్వామ్య చరిత్రలో అది ఎవ్వరికీ సాధ్యం కాలేదని.. భవిష్యత్తులోనూ అలా జరగదని ఆయన వ్యాఖ్యానించారు. జెన్‌జీ అంతా చూస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఆయన మోడీ సర్కారును ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం. కాకపోతే ఘాటు విమర్శలేవీ చేయకుండా చైతన్యవంతంగా సాగిన కమల్ ప్రసంగానికి పార్లమెంటులో ప్రతిపక్షాల నుంచి కరతాళ ధ్వనులు వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా కమల్ స్పీచ్‌కు మంచి స్పందన వచ్చింది.