టీడీపీకి మరో ఫైర్ బ్రాండ్ మహిళా నేత దొరికారు

గళ్లా మాధవి… 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఘన విజయం సాధించిన మహిళా నేత. తొలి ప్రయత్నంలోనే మాజీ మంత్రి విడదల రజనీని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మాధవి. అయితే, మాధవి కొద్ది సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినా ఆ సందర్భం, విషయంపై మాత్రమే ఆచితూచి మాట్లాడేవారు. అయితే, సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మాధవి పేరు ప్రముఖంగా వినిపించింది.

మాధవి, ఆమె భర్త ఆధ్వర్యంలోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆరోపించారు. ఈ క్రమంలోనే మౌనిక వ్యాఖ్యలకు ఫైర్ బ్రాండ్ నేతగా మారిన మాధవి కౌంటర్ ఇచ్చిన వైనం ఆకట్టుకుంది. ఎక్కడా నోరు జారకుండా, చాలా పద్ధతిగా మౌనికతో పాటు అంబటి రాంబాబును, వైసీపీ అధినేత జగన్ ను, వైసీపీ నేతలు ఐదేళ్లలో చేసిన అరాచకాలను మాధవి కడిగేశారు.

తమకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని, ఇటువంటి గొడవలు పడేంత సమయం తమకు లేదని మాధవి చురకలంటించారు. అయితే, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబును అంబటి అంత మాటలన్న తర్వాత తాము ప్రజలకు ఉపయోగపడే పనులు పక్కకు పెట్టి స్పందించాల్సి వచ్చిందని మాధవి వ్యాఖ్యానించిన తీరు ఆకట్టుకుంది. ఇన్నాళ్లూ భరించామని, కానీ ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటే పార్టీలోని కార్యకర్తలకు, ప్రజలకు తప్పుడు సందేశం వెళుతుందని క్లారిటీగా చెప్పారు. ఇకనైనా ఇటువంటి వ్యాఖ్యలను వైసీపీ నేతలు మానుకోవాలని, లేదంటే అంబటి సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని, ఇక ఉపేక్షించబోమని గుంటూరు మహిళగా చెబుతున్నానని వైసీపీ నేతలకు మాధవి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.

ఈ రోజు మాధవి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడిన తీరు, చూపిన ఆత్మవిశ్వాసం, విశ్లేషణా సామర్థ్యం, ప్రతి విమర్శలతో విరుచుకుపడిన తీరు చూస్తుంటే టీడీపీకి భావి ఫైర్ బ్రాండ్ మహిళా నేత దొరికినట్లే కనిపిస్తోంది. మాధవికి ఉన్న విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, ఆమె ప్రశ్నించే తీరు చూస్తుంటే గుంటూరు రాజకీయాల్లో కీలక నేతగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయంగా చైతన్యం ఎక్కువగా ఉన్న గుంటూరు నగరంలో యువ మహిళా నేతగా, ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఆమె ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.