మెటా (Meta) ప్రస్తుతం అందరికీ పరిచయం ఉన్న పేరు. వాట్సాప్ ఈ సంస్థకు చెందినదనే విషయం తెలిసిందే. అయితే భారత్‌లో ఈ సంస్థ కార్యకలాపాల నిర్వహణపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చి చెప్పింది. అలా కాకుండా వ్యక్తుల సమాచారాన్ని లీక్ చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. మీకు నచ్చకపోతే ఈ దేశం నుంచి వెళ్లిపోవచ్చు అని తేల్చిచెప్పింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో తీసుకువచ్చిన గోప్యతా చట్టాన్ని ఏ సంస్థ అయినా పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా చెందిన సమాచారాన్ని దోచుకునేందుకు తాము అంగీకరించబోమన్నారు. ఒకవేళ దేశంలోని చట్టాలను గౌరవించలేకపోతే లేదా వాటి ప్రకారం నడుచుకోలేకపోతే తక్షణమే దేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు.
విషయం ఏంటి?
ఈరోజుల్లో తెల్లారినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది వాట్సాప్‌లోనే గడుపుతున్నారు. ఆనందం, బాధ, ఆఫీసు పని ఏదైనా కూడా వాట్సాప్ కీలక వేదికగా మారింది. ప్రత్యామ్నాయ వేదికలు ఉన్నా వాట్సాప్‌తో ప్రజలకు గట్టి అనుబంధం ఏర్పడింది. అయితే ఈ వ్యవహారాన్ని అలుసుగా తీసుకున్న వాట్సాప్ వ్యక్తుల సమాచారాన్ని మెటాకు చేరవేస్తోందన్నది కొన్నేళ్లుగా ప్రధాన చర్చ. విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2011లో దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది.
ఈ పిటిషన్‌పై తరచుగా విచారణలు జరుగుతున్నాయి. దేశంలోని ప్రైవసీ చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందేనని, వాట్సాప్ సంస్థ తన వినియోగదారుల సమాచారాన్ని ఇతర ఏ సంస్థతోనూ పంచుకోకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి అకౌంట్ అయినా వాట్సాప్ తన ఇష్టానుసారం వ్యవహరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే దేశం నుంచి వెళ్లిపోవచ్చని కూడా వ్యాఖ్యానించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates