తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో జనసేన తరపున పవన్ కల్యాణ్ కార్యనిర్వాహక కమిటిని నియమించారు. జనసేన అధినేత తరపున రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ మీడియా రిలీజ్ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా కార్యనిర్వాహక కమిటిని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. పదిమందితో కూడిన ఈ కమిటి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో వెంటనే తన పర్యటనను ప్రారంభించేస్తుందట.
ఈ కమిటి ఏమి చేస్తుందయ్యా అంటే పార్టీపరంగా శ్రేణులను సమాయత్తపరుస్తుందట. అలాగే పార్లమెంటు పరిధిలోని క్షేత్రస్ధాయి పరిస్ధితులపై అధ్యయనం చేసి అంచనా కూడా వేస్తుందట. పార్టీ విధానాలతో నేతలు, శ్రేణులను కమిటి ముందుకు తీసుకెళుతుందని హరిప్రసాద్ చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకుని, రాజకీయ సంబంధిత విషయాలను క్రోడీకరిస్తుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తొందరలోనే కమిటి తన పర్యటన పూర్తిచేసుకుని నివేదిక తయారు చేసి పవన్ కు ఇస్తుందట.
ఆ నివేదికను పవన్ ఏమి చేసుకుంటారు ? అసలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి గట్టి నేతలు, శ్రేణులంటు ఉంటే కదా. జనసేనలో ఉన్నవాళ్ళల్లో అత్యధికులు ఓటుహక్కు లేని అభిమానులే కదా ? పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలైనా గ్రామస్ధాయిలో కమిటిల ఏర్పాటుపై పవన్ ఏనాడూ దృష్టి పెట్టిందేలేదు. ఏదో గాలివాటం మనిషి కాబట్టే పార్టీని కూడా గాలికి నెట్టుకొచ్చేస్తున్నారు.
ఒకవైపేమో బీజేపీ ప్రచారం మొదలుపెట్టేసింది. అభ్యర్ధిని ఖరారు చేయకున్నా కమలంపార్టీనే పోటీ చేస్తుందని స్వయంగా అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించేసి ప్రచారం మొదలుపెట్టేసిన విషయం తెలిసిందే. కాబట్టి పోటీ విషయమై ఇక జనసేన ఆశలు వదిలేసుకోవాల్సిందే. మరి ఈ దశలో కమిటిని ఏర్పాటు చేయటం వెనుక పవన్ కు ఏదైనా వ్యూహం ఉందా ? ఒకవేళ ఏదన్నా వ్యూహం ఉన్నా అది బీజేపీ ముందు పారుతుందా ? అన్నదే సందేహం. కమిటి వేశారు కదా చూద్దాం ఏం జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates