తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారి స్తున్న విషయం తెలిసిందే. ఈ సిట్.. ఇప్పటికే చాలా మందిని విచారించింది. మరీ ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా అధికారులు విచారించారు. అయితే.. సిట్ ఎప్పుడు ఎవరిని విచారణకు పిలిచినా.. వెంటనే వారు సిట్‌పై ఆరోపణలు చేయడం లేదా.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కామన్‌గా మారింది.
అయితే.. తాజాగా బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత మాత్రం.. సిట్ తనను కూడా విచారణకు పిలవాలని కోరుకున్నారు. సిట్ విచారణకు పిలిస్తే.. వెంటనే సహకరిస్తామని.. ఎంత సేపైనా విచారించుకోవచ్చని.. వాస్తవాలే చెబుతానని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత.. సిట్ ముందుకు వెళ్లిన కేసీఆర్… అన్నీ నిజాలే చెప్పి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు.
అయితే.. ఆయన ఏం చెప్పారో.. స్వయంగా ఆయన నోటి ద్వారానే ప్రజలకు కూడా చెప్పాలని కేసీఆర్‌ను కోరారు. గుంటనక్కల కుతంత్రాలకు కేసీఆర్ గురవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. వారి మాయలో పడితే పార్టీ కూడా నాశనం అవుతుందన్నారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితురాలినేనని ఆమె చెప్పారు. తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ విషయాలన్నీ సిట్ తమను విచారణకు పిలిస్తే వెళ్లి వివరిస్తానని చెప్పారు.
సిట్ అధికారులు, విచారణపై మాజీ మంత్రి, తన సోదరుడు కేటీఆర్ విమర్శల చేయడం తగదని కవిత సూచించారు. చట్టాన్ని ఇప్పుడైనా ఆయన గౌరవించాలని చురకలు అంటిచారు. చట్ట ప్రకారమే అధికారులు ఈ విచారణ చేస్తున్నారని.. త్వరలోనే ఈ కేసు ముగింపు దశకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అయితే.. గుంటనక్కలు కొందరు కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ కేసు విచారణ పూర్తికాకుండా అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates