నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిలబెట్టుకోవడం కోసం.. ఆంధ్రుల కోసం.. మహత్తరమైన నగరాన్ని నిర్మించడం కోసం.. తలకు కట్టిన పాగాను నడుముకు బిగించి.. మడిలో నిలపాల్సిన పాదాన్ని.. నడిరోడ్డుపైకెక్కించి.. రైతన్న సాగిస్తున్న రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తయింది. రాజధాని కడుతున్నాం.. భూములు ఇవ్వండి.. అంటే.. తటపటాయించిన అన్నదాత.. ఆనాడు.. ప్రభుత్వాధినేతగా చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మాడు. రాష్ట్ర ప్రజల కోసం.. రాష్ట్రం కోసం.. తాను సింధువు కావడాన్ని గర్వించాడు. ఈ క్రమంలోనే పచ్చటి పంటలతో విరజిల్లుతున్న 34 వేల ఎకరాలను కూడా రాష్ట్ర ప్రజల సమున్నత రాజధాని కోసం.. త్యాగం చేశాడు.
పావలా పెట్టి.. ముప్పావలా లబ్ధిని ఆశించే నేటి రోజుల్లో.. రైతన్న.. నిత్యం తమ జీవితాన్ని ముడివేసుకున్న జీవనాధారమైన.. పొలాలను ఎలాంటి లబ్ధిని ఆశించకుండానే రాష్ట్రం కోసం త్యాగం చేశారు. వీరు చేసిన త్యాగం ఎంత చెప్పుకొన్నా తక్కువే. రాజధాని ఏర్పడుతుందని.. తమ పొలాల్లో ప్రభుత్వ కార్యాయాలు వెలుస్తాయని.. ప్రపంచానికే ఈ రాజధాని ఒక తలమానికంగా నిలుస్తుందని అన్నదాత పెట్టుకున్న ఆశలు.. కొత్త ప్రభుత్వం రాకతో పటాపంచలయ్యాయి. రాజదానిని మార్చేస్తున్నాం.. అంటూ.. సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటించిన మరుక్షణమే.. రైతుల గుండెల్లో శతఘ్నులు పేలాయి. మేం ఇచ్చింది.. రాష్ట్రం కోసం.. రాజధానిని ఇక్కడ నుంచి తరలించేందుకు వీలు లేదు.. అంటూ.. బక్కచిక్కిన రైతన్న.. బావురుమన్నాడు.. ప్రభుత్వాన్ని శత విధాలా వేడుకున్నాడు.
అయినా.. కర్కశ నిర్ణయాన్ని కదల బార్చేందుకు ఇష్టపడని.. రాష్ట్ర సర్కారు.. తన నిర్ణయమే అమలు చేసేందుకు ప్రయత్నించింది. దీంతో రగిలిపోయిన.. రైతన్న.. రోడ్డెక్కాడు. శాంతి యుత నిరసనకు దిగాడు. అందరినీ ఏకం చేశాడు. నిరసన అంటే.. ఏదో ఒక రోజో.. ఒక వారమో.. అనుకున్న ప్రభుత్వ పెద్దలకు గూబలు అదిరిపోయేలా.. రోజులు.. నెలలు.. ఇప్పుడు ఏకంగా ఏడాది పాటు.. ఉద్యమం కొనసాగుతూనే ఉంది. నాడు మొదలైనప్పుడు ఏ లక్ష్యంతో.. ఏ ఆశయంతో ఉద్యమాన్ని రైతన్న ప్రారంభిం చాడో.. అదే లక్ష్యం.. నేటికీ.. కళ్లముందు కనిపిస్తోంది. ఈ మద్యలో అనేక నిర్బంధాలు.. పోలీసుల ఒత్తిళ్లు.. కేసులు. జైళ్లు, లాఠీ దెబ్బలు.. ఇలా.. అనేకానేక సమస్యలు చుట్టుముట్టాయి.
రాజకీయ నేతల నుంచి దూషణలు వచ్చాయి. పెయిడ్ అన్నారు.. ప్రాపుకోసం అన్నారు.. సామాజిక వర్గం ఎత్తుగడ అన్నారు.. ఇలా ఎన్ని చేసినా.. ఎన్ని అన్నా.. రైతన్న ఉక్కు పిడికిలి బెడిసిపోలేదు! రాష్ట్రం మొత్తం ఇప్పుడు రైతన్న వెంటే ఉంది. రాష్ట్ర ప్రయోజనం కోసం.. నిత్యం సమిధ అవుతున్న అన్నదాత కోసం.. రాష్ట్ర రాజధాని కోసం.. ఏం చేసేందుకైనా.. సిద్ధమేనని సోషల్ మీడియాలో రాజధానికి వెల్లులవెత్తుతున్న మద్దతు నిరూపిస్తోంది. అనేక రూపాల్లో రైతులకు.. సాయం చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు కూడగట్టిన ఘనత నిస్సందేహంగా రైతన్నదే!
జై కిసాన్! అన్న ఈ దేశంలో రైతు గెలిచి తీరతాడు.. కాకపోతే.. కొంత సమయం పట్టొచ్చు!!
అంటారు సామాజిక ఉద్యమ కారుడు.. అన్నాహజారే!! ఇప్పుడు ఇదే.. సూత్రం.. అమరావతి కోసం.. అహోరాత్రులు ఉద్యమిస్తున్న అన్నదాతకు కూడా వర్తించడం ఖాయం.
తన కోసం కాదు.. మనందరికోసం.. కష్టపడేవారు.. తల్లి కన్నా ఎక్కువగా మన ఆకలి తీర్చేందుకు నడుం వంచేవారు ఎవరైనా ఉంటే వారు అన్నదాతలే!
– అంటారు.. తన సత్యంతో నా ప్రయోగం
పుస్తకంలో మహాత్ముడు! అటువంటి అన్నదాత.. తన ఉద్యమంలో ఇప్పటికే గెలిచాడు.. రాజధాని ఉద్యమాన్ని ప్రతి ఆంధ్రుడి.. ప్రతి తెలుగు వారి నరనరాన జీర్ణించుకునేలా చేశాడు.. ఇక, మిగిలింది అమరావతి నిర్మాణమే!! దీనికే కొంత టైం పట్టొచ్చేమో!!