బాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 5,555 ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది.

ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీలో నిర్వహించిన ప్రజావేదిక వరకు అంటే దాదాపు 3 కిలోమీటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులతో కలిసి ఈ–సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి సైకిల్‌పై ముందుండి నడిపిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది.

ఇ–మోటరాడ్ సంస్థ తయారు చేసిన ఈ–సైకిళ్లను కుప్పంలోని యూనిట్‌లోనే అసెంబ్లింగ్ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. పర్యావరణ హిత ప్రయాణానికి, మహిళలకు ఉపాధి అవకాశాలకు ఈ–సైకిళ్లు దోహదపడతాయని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.