11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజ్యాంగంలోని 174వ అధికరణం ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు సమన్లు జారీ అయ్యాయి.

ప్రతిపక్ష హోదా అంశంపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఈ సమావేశాలు మరో పరీక్షగా మారనున్నాయి. గతంలో అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక మారిన రాజకీయ పరిస్థితుల్లో వైఖరిని సవరించుకుంటారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

గత ఎన్నికల్లో వైసీపీకి లభించిన 11 సీట్లే ఇప్పటికీ పార్టీకి మానసిక భారం. ఇప్పుడు అదే 11వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం, దానిపై సోషల్ మీడియాలో సెటైర్లు రావడం వైసిపికి మింగుడు పడని పరిస్థితి. ఫిబ్రవరి 11న సభకు వెళ్లాలా? వద్దా? అన్న ప్రశ్న జగన్ ముందు నిలిచినట్లుగా కనిపిస్తోంది.

అసెంబ్లీ రిజిస్టర్లలో వైసీపీ సభ్యులు సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు, హాజరు లేకపోతే జీతభత్యాల కోతపై హెచ్చరికలు పార్టీ నేతల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఒకవైపు పార్టీ నిర్ణయం, మరోవైపు సభ్యుల వ్యక్తిగత అవసరాలు, ఈ రెండింటి మధ్య వైసీపీ నేతలు సతమతమవుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

“హోదా లేని సభలో ఎందుకు పాల్గొనాలి?” అన్న వైఖరిని జగన్ కొనసాగిస్తారా? లేక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 11 నియోజకవర్గాల ప్రజల సమస్యల కోసం అయినా అసెంబ్లీ మెట్లెక్కుతారా? అన్నది వేచి చూడాల్సిందే. ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధమవుతున్న వేళ, ప్రధాన ప్రతిపక్ష నేత వైఖరి ఎలా ఉంటుందన్నది ఈ సమావేశాల రాజకీయ దిశను నిర్ణయించనుంది.