తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రభుత్వానికి తాజాగా 14 పేజీల నివేదికతో పాటు లేఖను సమర్పించినట్టు తెలిసింది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.
సిట్ నివేదికలో అప్పటి, ప్రస్తుత టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ పాత్రపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది.
నెయ్యి సరఫరాకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, అవసరమైన నియమావళి తయారీలో నిర్లక్ష్యం వహించారని సిట్ తన లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. దీని కారణంగా నెయ్యి నాణ్యతలో రాజీ జరిగిందని నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది.
సిట్ సిఫారసుల నేపథ్యంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కల్తీ నెయ్యి సరఫరాకు కారణం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణ విధానంలో తీసుకొచ్చిన మార్పులేనని సిట్ దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఆ మార్పులను అప్పట్లో ఈవో స్థాయిలో సకాలంలో గుర్తించకపోవడం లేదా గుర్తించినా పట్టించుకోకపోవడం క్షమించరాని నిర్లక్ష్యంగా సిట్ అభిప్రాయపడినట్టు సమాచారం.
విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, టీటీడీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గిన అంశాలపై సిట్ గట్టిగా అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates