త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయంతో టీఆర్ఎస్ కు తొలి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. దుబ్బాక గెలుపు…ఆ తర్వాత బల్దియా బరిలో అధికార పార్టీకి ఆధిపత్యానికి గండికొట్టడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎంపీ బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ కేడర్ లో ఉత్సాహం వచ్చింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ లపై బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ….దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

గ్రేటర్ వార్ లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధించిన జోష్ లో ఉన్న సంజయ్… తాజాగా సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్….కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కోతల రాయుడని, బల్దియాలో ఓటమి తర్వాత ఢిల్లీకి వెళ్తారని తాను ముందే చెప్పానని అన్నారు. ఢిల్లీలో వంగివంగి దండాలు పెట్టినంత మాత్రాన క్షమించబోమని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.

బల్దియా ఎన్నికల్లో పరాజయం పాలైన కేసీఆర్…ప్రజల దృష్టి మరల్చేందుకే ఢిల్లీకి వెళ్లారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ బయటకు చెప్పేదొకటి…లోపల జరిగేది మరొకటని సంజయ్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ వరదల్లో చిక్కుకున్నపుడు కేసీఆర్ ఫాం హౌస్ గడప దాటలేదని, ఇపుడు వరద సాయం కోసం ఢిల్లీలో వంగి వంగి పొర్లు దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అడ్డగోలుగా ప్రాజెక్టు వ్యయం పెంచారని మండిపడ్డారు. కాళేశ్వరానికి అతి తక్కువ సమయంలోనే కేంద్రం అనుమతులిచ్చిందని అన్నారు. మా రాష్ట్రం.. మా నిధులంటూ కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచడంపై ప్రశ్నించిన వారి గొంతును నొక్కారని…ఈ రాష్ట్రం మీ అయ్య జాగీరా? అని బండి సంజయ్ దుయ్యబట్టారు.

కాగా, కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. బీజేపీతో ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ అన్నట్టు టీఆర్‌ఎస్‌, బీజేపీ వైఖరి ఉందని ఠాగూర్ ఎద్దేవా చేశారు. కేసులకు భయపడి కేసీఆర్ బీజేపీని శరణుకోరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కుటుంబంపై మరో 6 నెలల పాటు ఐటీ, ఈడీ దాడులు ఉండవని షాకింగ్ కామెంట్లు చేశారు.