వీడియో: అంబటి సంక్రాంతి సంబరాలు

భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే పాటకు భోగి మంటల చుట్టూ తిరుగుతూ స్టెప్పులు వేసి, “సంక్రాంతి అంటే నేనే” అన్నట్లుగా సోషల్ మీడియాలో సందడి చేశారు.

గతంలో సత్తెనపల్లిలో వేసిన స్టెప్పులు ఎలా వైరల్ అయ్యాయో, ఈసారి గుంటూరు పశ్చిమలోనూ అదే ఫార్ములా రిపీట్ అయింది. పండుగంటే పూజలు కాదు… డ్యాన్స్ కావాలన్నట్లు కార్యక్రమం స్థానికంగా ఆకర్షణగా మారింది.

తన డ్యాన్స్‌కు వచ్చిన క్రేజ్‌కి కారణం ఎవరో కాదు… పవన్ కళ్యాణే అని అంబటి తేల్చేశారు. “సంక్రాంతి అంటే అంబటి రాంబాబు గుర్తొచ్చేలా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణే” అని చెప్పారు. తాను డ్యాన్స్ చేస్తే సంబరాలు, పవన్ చేస్తే సినిమాటిక్ సీన్స్ అన్నట్టుగా పోలికలు కూడా ఇచ్చారు. ‘సంబరాల రాంబాబు’ అనే బిరుదు కూడా పవన్ వల్లే వచ్చిందని అన్నారు. 

ఇంతటితో ఆగకుండా, “నేను రాజకీయ నాయకుడిని… ఆయన సినిమా యాక్టర్” అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ‘బ్రో’ సినిమాలో తన పాత్ర పెట్టి గేలి చేశారని ఆరోపించారు, కానీ అదే స్టెప్పులు పవన్ కూడా వేసారని కౌంటర్ ఇచ్చారు. దీంతో సంక్రాంతి పండుగ ముగిసినా… అంబటి స్టెప్పుల హడావుడి మాత్రం ఇంకా ఆగేలా లేదని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.