ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ యువకులతోపాటు.. చిన్నారులకు కూడా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, పాటలు వంటివి నిర్వహించారు. ఆయా క్రీడలు, సంబరాల్లో సీఎం చంద్రబాబు , ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్నారులకు నిర్వహించిన ఆటల పోటీల్లో దేవాన్ష్ పాల్గొని సందడి చేశాడు.
విజిల్ ఆట, కుర్చీలాట, కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడల్లో దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొన్నాడు. స్థానిక చిన్నారులతో కలిసి కలివిడి గా ఆటలాడాడు. దేవాన్ష్ దూకుడు, అతను ఆడిన విధానాన్ని వేదికపై నుంచి చాలా ఆసక్తిగా వీక్షించిన సీఎం చంద్రబాబు ఎంతో మురిసిపోయారు.
తన మనవడిని ప్రోత్సహిస్తూ.. వేదికపై నుంచి చప్పట్లు చరిచారు. ప్రతి సందర్భంలోనూ దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా క్రీడల్లో విజేతలుగా నిలిచిన పలువురికి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కానుకలు అందించారు.
కాగా.. బుధవారం భోగిని పురస్కరించుకుని నారావారి పల్లెలోని నివాసం ముందు సీఎం చంద్రబాబు దంపతులు భోగి మంటలు వేయనున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొననున్నారు.
అనంతరం .. స్థానిక నాగాలమ్మ ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గురువారం సంక్రాంతిని పురస్కరించుకు ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేసమయంలో స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు గురువారంప్రత్యేక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మొత్తంగా ఈ మూడురోజులు నారా వారిపల్లెలో సందడి వాతావరణం నెలకొంది.

Gulte Telugu Telugu Political and Movie News Updates