వైసీపీ కార్యాల‌యంలో `సంక్రాంతి` ర‌ద్దు?

గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఏటా నిర్వ‌హించే సంక్రాంతి సంబ‌రాల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి గ‌త ఏడాది కూడా తూతూ.. మంత్రంగా నిర్వ‌హించారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మాత్రం ఘ‌నంగా ఈ సంబ‌రాల‌ను తాడేప‌ల్లి నివాసంలో అప్ప‌టి సీఎం హోదాలో జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి నిర్వహించారు. ఇక‌, గ‌త ఏడాది మాత్రం పార్టీ ఓడిపోయిన ద‌రిమిలా.. 11 సీట్ల‌కు ప‌రిమిత‌మైన ద‌రిమిలా.. ఈ సంబ‌రాల‌ను కేవ‌లం తూతూ మంత్రంగా నిర్వ‌హించి.. ప‌రిమితం చేశారు.

అయితే.. ఓట‌మి బాధ నుంచి బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో వైసీపీలో సంక్రాంతి ముచ్చ‌ట్ల‌పై కొన్నాళ్లుగా జోరుగా చ‌ర్చ‌లు సాగాయి. ఈ ఏడాది సంక్రాంతిని భారీగా నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. త‌ద్వారా పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఆత్మ‌స్థ‌యిర్యం నింపాల‌ని.. పార్టీ మంచి జోష్‌పై ఉంద‌న్న సందేశాన్ని కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. అనూహ్యంగా రెండు కార‌ణాల‌తో తాజాగా సంక్రాంతి సంబ‌రాల‌ను పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ర‌ద్దు చేసిన‌ట్టు తెలిసింది. 1) కీల‌క నాయ‌కులు.. జైల్లో ఉండ‌డం. ముఖ్యంగా సంక్రాంతి వేడుక‌ల‌ను అన్నీ తానై నిర్వ‌హించే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి జైల్లో ఉన్నారు.

ఇక‌, మిగిలిన నాయ‌కులు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన జోగి ర‌మేష్ బ్ర‌ద‌ర్స్‌, గుంటూరు జిల్లాకు చెందిన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా జైల్లోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సంక్రాంతి సంబ‌రాలు నిర్వ‌హించ‌డం స‌రికాద‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో అమ‌రావ‌తి రాజ‌ధానిపై జ‌గ‌న్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. రాజ‌ధాని ప్రాంతంలో రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు కూడా దారి తీసింది. దీంతో కేంద్ర‌కార్యాల‌యంలో సంక్రాంతి పండుగ సంబ‌రాలు చేయ‌రాద‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

మ‌రోవైపు.. దీనికి భిన్నంగా ఇదే మంగ‌ళ‌గిరిలోని టీడీపీ, జ‌న‌సేనల‌కేంద్ర కార్యాల‌యాల్లో సంక్రాంతి సంబ‌రాలు అంబ‌రాన్నంటేలా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధ‌వారం భోగి, గురువారం సంక్రాంతి, శుక్ర‌వారం క‌నుమ పండుగ‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. కానీ, ఇదే ప్రాంతంలో ఉన్న వైసీపీ కార్యాల‌యంలో మాత్రం ఎలాంటి సంద‌డి ఉండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.