విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌ క‌రూర్‌లో నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో తొక్కిస‌లాట జ‌రిగిన విష‌యం తెలిసిందే. నాటి ఘ‌ట‌న‌లో 41 మంది మృతి చెందారు. ఈ కేసును తాజాగా సీబీఐ విచార‌ణకు చేప‌ట్టింది.

ఈ క్ర‌మంలో సోమ‌వారం సీబీఐ ఆదేశాల మేర‌కు ఢిల్లీలోని ఆ సంస్థ‌కేంద్ర కార్యాల‌యానికి విచార‌ణ నిమిత్తం విజ‌య్ హాజ‌ర‌య్యారు. తొక్కిస‌లాట‌కు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొన్నారు. త‌న‌ను ఎన్ని కోణాల్లో విచారించినా.. ఇదే చెబుతాన‌న్నారు.

అయితే.. అక్క‌డితో సీబీఐ ఆయ‌న‌ను వ‌దిలేయ‌లేదు. తాజాగా మ‌రోసారి విచార‌ణ‌కు రావాలంటూ.. విజ‌య్‌కు స‌మ‌న్లు పంపింది. ఈ నెల సంక్రాంతి ప‌ర్వ‌దినాల అనంత‌రం 19వ తారీకున మ‌రోసారి కేంద్ర కార్యాల‌యానికి రావాల‌ని.. సీబీఐ అధికారులు తాజా స‌మ‌న్ల‌లో స్ప‌ష్టం చేశారు.

త‌మ‌కు అనేక అనుమానాలు ఉన్నాయ‌ని.. వాటిపై ప్ర‌శ్నించాల్సి ఉంద‌ని సీబీఐ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనిపై విజ‌య్ నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. అయితే.. సీబీఐ వ్య‌వ‌హారంపై అధికార పార్టీ డీఎంకే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. బీజేపీతో పొత్తుకు విజ‌య్ సిద్ధ‌ప‌డితే.. సీబీఐ వెంట‌నే క్లీన్ చిట్ ఇస్తుంద‌ని డీఎంకే నేత వ్యాఖ్యానించారు.

నిజ‌మేనా?

తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌-మేల మ‌ధ్య త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో టీవీకే పార్టీ కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని పరిశీల‌కులు, ముంద‌స్తు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టీవీకేతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ అగ్ర‌నేత‌లు చేతులు చాస్తున్నారు.

కానీ, టీవీకే మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఎవ‌రితోనూ పొత్తుకు వెళ్లేది లేద‌ని.. ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని చెప్పారు. కానీ.. బీజేపీ స‌హా కాంగ్రెస్, క‌మ్యూనిస్టు నేత‌లు కూడా.. టీవీకే విజ‌య్‌తో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌మాట వాస్త‌వం. కానీ, ఆయ‌న అందుబాటులోకి రావ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో క‌రూర్ ఘ‌ట‌న‌పై సీబీఐ దూకుడు పెంచ‌డం..వరుస‌గా విజ‌య్‌ను విచార‌ణ నిమిత్తం ఢిల్లీకి పిలిపించ‌డం వంటివి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి. ఆయ‌న క‌నుక బీజేపీతో ఎన్నిక‌ల పొత్తుకు సిద్ధ‌మైతే.. ఇక‌, సీబీఐ సైలెంట్ అవుతుంద‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

గ‌తంలో మ‌హారాష్ట్ర‌లోనూ.. సీబీఐ కేసులు ఎదుర్కొన్న ఎన్సీపీ చీలిక నేత అజిత్ ప‌వార్ సైతం బీజేపీతో చేతులు క‌లిపిన అనంత‌రం.. ఆయ‌న‌పై కేసులు ఎటు పోయాయో ఎవ‌రికీ అర్ధం కాలేదు. ఇక‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌పై న‌మోదైన అక్ర‌మ కేసులు కూడా ఎక్క‌డివ‌క్క‌డే నిలిచిపోయాయి. ఇలా.. బీజేపీతో పొత్తుకు రెడీ అంటే.. విజ‌య్ కూడా ఒడ్డున ప‌డ‌తారంటూ.. డీఎంకే నేత‌లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.