పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు స‌హా.. ఉమ్మ‌డి కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కోడి పందేల జోరు పెరిగింది. అయితే.. ఒక‌ప్పుడు కేవ‌లం ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిన కోడి పందేలు.. ఇప్పుడు మ‌రింత ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కృష్ణా, గుంటూరు, తాజాగా నెల్లూరు జిల్లాల‌కు కూడా ఈ పందేలు పాక‌డం విశేషం.

ఇదిలావుంటే.. తాజాగా జ‌రుగుతున్న పందేల్లో వైసీపీ నాయ‌కులు, టీడీపీ నేత‌లు.. మంత్రులు కూడా జోడీ క‌ట్ట‌డం ఆశ్చ‌ర్యంగా కనిపిస్తోంది. దీనికి వారు సంప్రదాయాలు అనే ముద్దు పేరు పెట్ట‌డం మ‌రో విశేషం. అంతేకాదు.. క‌ల‌సి క‌ట్టుగా బ‌రులు వేశారు. పందెల్లో ఎలాంటి పోలీసులు, రెవెన్యూ ఇబ్బందులు రాకుండా.. స‌మ‌ష్టిగా కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలా.. నాయ‌కులు క‌లిసిపోవ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి గ‌తంలోనూ నాయ‌కులు క‌ల‌సి ముందుకు సాగినా.. ఈ ఏడాది ఉన్న‌ట్టుగా అయితే.. గ‌తంలో వాతావ‌ర‌ణం క‌నిపించ‌లేదు. ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకునేవారు. పోలీసుల‌కు ఉప్పందించేవారు. కానీ.. ఈ సారి మాత్రం ఉమ్మ‌డిగా బ‌రులు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్నీ చ‌క్క‌గా పంచుకుంటున్నారు. అంతేకాదు.. క‌ల‌సి క‌ట్టుగా క‌లివిడిగా ముందుకు సాగుతున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఈ త‌ర‌హా సామ‌ర‌స్యం అంద‌రికీ తెలిసిందే.

కానీ ఉమ్మ‌డికృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా.. నిన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసుకున్న నాయ‌కులు తాజాగా క‌లిసిపోయారు. ఈ విష‌యాన్ని ప్ర‌శ్నించిన వారిపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సంప్ర‌దాయాల‌ను కాపాడుకునేందుకు క‌లిస్తే త‌ప్పేంట‌ని.. ఇరు పార్టీల నాయ‌కులు ప్ర‌శ్నించ‌డం కొస‌మెరుపు. మొత్తంగా.. రాజ‌కీయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. నాయ‌కులు ఈ ద‌ఫా క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగ‌డం.. పందేల‌కు సిద్ధం కావ‌డం.. అంద‌ర‌నీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.