సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. బంధుమిత్రులు, తనను ఎన్నుకున్న ప్రజలతో మమేకం కానున్నారు. ఈ సమయంలోనూ ఆయన రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై చాలా అలెర్ట్గా ఉన్నారు.

పండుగ వేళలో గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో 38 తాటాకు ఇళ్లు కాలిపోయాయి. దీనిపై చంద్రబాబు నాయుడు సత్వరం స్పందించారు. కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.

సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని సీఎం విచారం వ్యక్తం చేశారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోం మంత్రి అనిత, ఇతర అధికారులు వివరించారు.

ఏపీలో ఏమూల చిన్న సంఘటన జరిగినా తాను అప్రమత్తం అవడమే కాకుండా మంత్రులను, అధికారులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. మొన్నటికి మొన్న విశాఖ జగదాంబ సెంటర్లో మహిళపై దాడి ఘటనపై సీఎం వెంటనే స్పందించారు. ఈ దాడి కేసును ఛేదించిన పోలీసులను ప్రశంసించారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజల సమస్యలపై స్పందిస్తున్న తీరును చూసిన అధికారులు, మంత్రులు సైతం తమ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటలపై అప్రమత్తంగానే ఉంటున్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో కూటమి నేతలు స్పందిస్తున్న తీరు ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నాయనడంలో సందేహం లేదు.