`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ.. ఇత‌రుల‌కు ఆటంకం క‌లిగించ‌డంతోపాటు.. ప్ర‌మాదాల‌కు కూడా కార‌ణ‌మ‌వుతున్న వాహ‌న‌దారులు పెరుగుతున్నారు. దీనికితోడు ట్రిపుల్ రైడింగ్‌, డ్రంక్ అండ్ డ్రైవ్‌, రెడ్ సిగ్న‌ల్ జంపింగ్, హైస్పీడ్ రైడింగ్, నోహెల్మెట్‌ ఇలా.. అనేక విష‌యాల్లో వాహ‌న‌దారులు రెచ్చిపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు చేస్తూ.. కేసులు క‌డుతున్నారు. చ‌లానాల మోత మోగిస్తున్నారు.

హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌.. త‌దిత‌ర ప్రాంతాల్లో నిత్యం వేలాది చ‌లానాలు న‌మోద‌వుతున్నాయి. అయితే.. చ‌లానా రాసిన త‌ర్వాత‌.. మూడు మాసాల వ‌ర‌కు వాహ‌న దారుల‌కు స‌మ‌యం ఉంటుంది. ఈ లోగా వారు తమంత‌ట తామే ఆ చ‌లానాల‌కు సంబంధించిన రుసుము చెల్లించే అవ‌కాశం ఉంది. అయితే.. దీనిని సాకుగా తీసుకుని వాహ‌న‌దారులు అస‌లు చ‌లానాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. పోలీసులు మ‌రోసారి త‌నిఖీలు చేసి ప‌ట్టుకుంటే.. అప్పుడు పాత చ‌లానాల వ్య‌వ‌హారం వెలుగు చూస్తోంది. లేదా.. చ‌లానాల కోస‌మే ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించాల్సి వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వాహ‌న దారుల‌కు చ‌లానాలు రాసిన‌ప్పుడు.. వెంట‌నే నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఆయా వాహ‌నాల య‌జ‌మానుల బ్యాంకు ఖాతాల నుంచి స‌ద‌రు ఫైన్ క‌ట్ అయ్యే వ్య‌వ‌స్థ‌ను తీసుకురానున్న‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆర్టీవో అధికారులు.. వాహ‌న య‌జ‌మానుల రిజిస్ట్రేష‌న్ ప‌త్రాల‌కు.. బ్యాంకు ఖాతాల‌ను కూడా లింకు చేయాల‌ని ఆయ‌న సూచించారు. తాజాగా ర‌హ‌దారి భ‌ద్ర‌త‌కు సంబంధించిన రూపొందించిన‌.. అరైవ్‌-అలైవ్ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చ‌లానాల‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంద‌ని సీఎం తెలిపారు.

ర‌హ‌దారుల‌పై ఎవ‌రి ఇష్టంవ‌చ్చిన‌ట్టు వారు వాహ‌నాలు న‌డుపుతూ..పోతే ప‌క్క ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని సీఎం తెలిపారు. అంతేకాదు.. ర‌హ‌దారి ప్ర‌యాణాల్లో మ‌ర‌ణాలు కూడా సంభ‌విస్తున్నాయ‌న్నారు. వీటిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో చ‌లానా రాసిన కొన్ని నిమిషాల్లోనే బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము క‌ట్ అయ్యే వ్య‌వ‌స్థ‌ను త్వ‌ర‌లోనే తీసుకురానున్న‌ట్టు చెప్పారు. ఈ విష‌యంలో పోలీసులు అత్యంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ర‌హ‌దారి భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు.