బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఉమ్మ‌డిచిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న నారావారి ప‌ల్లెకు ప్ర‌తి సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు కుటుంబం మొత్తం అక్క‌డే ఉంటుంది. ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాలోకేష్ సోమ‌వారం సాయంత్రం తిరుప‌తి నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో చంద్ర‌గిరికి బ‌య‌లు దేరారు.

అయితే.. వాస్త‌వానికి పండుగ సంద‌డికోసం సొంతూరు వెళ్తున్న స‌మ‌యంలో హ్యాపీగా జ‌ర్నీచేయొచ్చు. కానీ, వారు మాత్రం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్‌ను హెలికాప్ట‌ర్ నుంచే ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు `స్వదేశీ దర్శన్ 2.0` కింద  97 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని స‌ర్కారు ఇప్ప‌టికే అధికారులను ఆదేశించింది.

దీంతో ఈ నిధుల‌తో చేప‌ట్టిన షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులను ఏరియ‌ల్ వ్యూ ద్వారా చంద్ర‌బాబు, నారా లోకేష్‌లు ప‌రిశీలించారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్‌పీరియన్స్ జోన్‌ కూడా ప‌రిశీలించారు. హెలికాప్టర్‌లో నారావారిపల్లెకు వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్ నిశితంగా గ‌మ‌నించారు. హెలికాప్ట‌ర్‌లోనే ఉన్న ఉన్న‌తాధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

ప‌ల్లె నుంచే పాల‌న‌

సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని నారా వారి ప‌ల్లెకు వెళ్తున్న సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌లు.. మూడు రోజుల పాటు అక్క‌డే ఉండ‌నున్నారు. అయితే.. అక్క‌డి నుంచే మూడు రోజులు ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని న‌డిపించ‌నున్నారు. మూడు రోజులు పాల‌నను నానరా వారి ప‌ల్లె నుంచే సాగించ‌నున్నారు. కాగా.. భోగి, సంక్రాంతి, క‌నుమ పండుగ‌ల‌ను అక్క‌డే నిర్వ‌హించుకోనున్నారు. ఈ సంబ‌రాల్లో నంద‌మూరి ఫ్యామిలీ కూడా పాల్గొంటుంది.