రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎవరు ఏమనుకున్నా.. తాము ప్రజల అభిప్రాయాలు, వారి అభిరుచుల మేరకు.. మార్పులు చేర్పులు చేయాలని సంకల్పించామన్నారు. ముఖ్యంగా పాలనకు అనుకూలంగా లేకపోవడంతో కొన్ని జిల్లాల్లో అభివృద్ధి ముందుకు సాగడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మార్పులు చేస్తామని తేల్చి చెప్పారు.
జిల్లాల విభజనతోనే.. అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు సహా కొన్ని జిల్లాల సరిహద్దులు మార్చాలని అనేక విజ్ఞప్తులు వచ్చాయని సీఎం తెలిపారు. ఈ క్రమంలో జిల్లాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.
త్వరలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లాల పునర్విభజనను శాస్త్రీయంగా చేపట్టేందుకు కసరత్తు ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. ప్రజల నుంచి మరోసారి అభిప్రాయాలు సేకరిస్తుందని.. దాని ప్రకారం జిల్లాల విభజనను చేపట్టనున్నట్టు వెల్లడించారు.
అనంతరం జిల్లాల విభజనపై ముసాయిదా ప్రకటన విడుదల చేసి మరోసారి అభ్యంతరాలు కూడా స్వీకరిస్తామన్నారు. గతంలో మాదిరిగా.. అశాస్త్రీయంగా ఏదీ జరగదని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా జిల్లాల్లో ఇళ్ల స్థలాలను కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates