ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. తాను ఇప్పటి వరకు ఒక్క సెలవు కూడా పెట్టలేదన్నారు. ఒకవేళ ఏదైనా రోజు సెలవు తీసుకోవాలని అనుకున్నా.. ఏదో ఒక పని వస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ క్రమంలో కేవలం మంత్రులు, ఉన్నతాధికారులు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోలేరని చెప్పారు.
10 లక్షల మందికిపైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ లక్ష్య సాధనలో ముందుకు రావాలని ఆయన సూచించారు. తాజాగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 డైరీ ఆవిష్కరణలో కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలా సహకరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. అందుకే.. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా విడతల వారీగా ఉద్యోగులకు ఇస్తున్నామని చెప్పారు.
నేను నచ్చకపోయినా..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల్లో కొందరికి తానంటే నచ్చకపోవచ్చని అన్నారు. అయినప్పటికీ.. మీరు రాష్ట్రం కోసం.. ప్రజల కోసం పని చేస్తున్నారని గుర్తించాలని సూచించారు. గతంలో నెలలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయి.. నెల నెలా 1నే వేతనం వచ్చేలా చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల బీమా కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో పన్నులు, సిస్తుల వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. అప్పుడు ఆర్థికంగా రాష్ట్రం పుంజుకుంటుందన్నారు.
ఉద్యోగులకు బొనాంజా..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ.. సంక్రాంతి బొనాంజా ప్రకటించింది. కరువు భత్యం(డీఏ)ను 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై 1 నుంచి పెంచిన డీఏ అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో డీఏ 3.64 శాతం చొప్పున పెరిగినట్టు అయింది. 40 వేల రూపాయల మూల వేతనం తీసుకునే వారికి.. సుమారు 1400 రూపాయల వేతనం పెరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates