పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.
ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం అని తెలిపారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చు.. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.10,090 కోట్లు జమ చేశామని తెలిపారు. అలాగే స్త్రీశక్తి కార్యక్రమం కింద మహిళలు 3.5 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు, ఇందుకోసం ఇప్పటివరకు రూ.1,114 కోట్లు వ్యయం చేసినట్లు వెల్లడించారు.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు అందించామని, దీపం 2.0 కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసి రూ.2,684 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.50 వేల కోట్ల సామాజిక పెన్షన్లు అందించి సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించామని, ఇప్పటివరకు 70కు పైగా పెద్ద పథకాలు, కార్యక్రమాలు అమలు చేశామని సీఎం తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates