అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తారు. పదవులు దక్కని వారు అసంతృప్తిలోనే కొనసాగుతారు. కానీ, చిత్రం ఏంటంటే పదవులు దక్కిన వారు కూడా అసంతృప్తితోనే ఉన్నారన్నది టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన సంచలన వ్యాఖ్య.

వాస్తవానికి గత ఎన్నికల సమయంలో టికెట్లను త్యాగం చేసిన చాలా మంది నాయకులకు పదవులు దక్కలేదు. వారు అసంతృప్తితో ఉన్నారంటే అందులో వాస్తవం ఉంటుంది. కొంతవరకు దానిని అర్థం చేసుకోవచ్చు.

కానీ గత ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అనేక మందికి మార్కెట్ కమిటీ చైర్మన్‌లుగా, బోర్డు సభ్యులుగా, అలాగే ఇతర నామినేటెడ్ పదవుల్లో వందల మందిని నియమించారు. అయినప్పటికీ ఆ నాయకులు అసంతృప్తితోనే కొనసాగుతున్నారన్నది గోరంట్ల చెప్పిన మాట.

నిజానికి పదవులు పొందిన వారికి ఎంతో కొంత ప్రాధాన్యం ఉంటూనే ఉంటుంది. మరి ఎందుకు వారిలో అసంతృప్తి నెలకొంది అంటే, తాము కోరుకున్న పదవులు ఇవ్వలేదన్నదే కారణం.

ఇలా చేసుకుంటూ పోతే ఇక రాష్ట్రంలో ఉన్న పదవులన్నీ కోరుకున్న వారికే ఇచ్చుకుంటూ వెళ్తే మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు పదవులు దక్కని వారు ఎలాగో అసంతృప్తితోనే ఉన్నారు. వీరిలో కొంతమంది మాత్రమే ఎప్పుడో ఒకప్పుడు పదవి దక్కుతుందన్న ఆశతో ముందుకు సాగుతుండగా, మిగిలిన వారు మాత్రం ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.

ఇక పదవులు పొందిన వారిలో ముఖ్యంగా మంత్రి పదవులు దక్కిన వారిలో కూడా తాము కోరుకున్న శాఖలు రాలేదన్న ఆలోచనతో ఆవేదన వ్యక్తమవుతోందన్నది గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కీలక వ్యాఖ్య.

ఇది కూడా వాస్తవమే. దీనికి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లు చెప్పాల్సి ఉంటుంది. కానీ సహజంగా మంత్రివర్గంలో చోటు దక్కిన వారు సంతోషంగా ఉండాలి. అలాంటిది తాము కోరుకున్న క్యాబినెట్ స్థానం రాలేదని, ఆశించిన విధంగా జరగలేదని అలకలు వహిస్తూ అసంతృప్తితో ఉంటే అది ఎంతవరకు సమంజసమన్నదే గోరంట్ల చేసిన వ్యాఖ్యల సారాంశం.

మొత్తంగా అసంతృప్తి అన్నది అంతులేని విధంగా టీడీపీని వెంటాడుతోందన్నది వాస్తవం. పదవులు పొందిన వారు, పదవులు దక్కని వారు ఇద్దరూ అసంతృప్తితో ఉండటం సరైన పరిస్థితి కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.