‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇటీవల కాలంలో తిరుమల, ఇతర దేవాలయాలకు సంబంధించిన ఘటనలు తరచూ వివాదాస్పదంగా మారాయి. గతంలో పరకామణి చోరీ, లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు, తాజాగా మద్యం బాటిళ్ల వ్యవహారం వంటి అంశాలు భక్తుల్లో ఆందోళనను కలిగించాయి.

ఇవన్నీ సహజ సంఘటనలేనా? లేక రాజకీయ లెక్కలతో సాగుతున్న కుట్రలేనా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపధ్యంలో హిందూ మతంపై వైసీపీ దాడి చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో దేవాలయాలపై దాడులను ప్రేరేపించడమే కాకుండా, వాటిపై చులకన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పరకామణి చోరీ ఘటనను కూడా చిన్నపాటి దొంగతనంగా అభివర్ణించడమే జగన్‌ హిందూ మతంపై ఉన్న దృష్టిని స్పష్టంగా చూపుతోందని పలువురు మంత్రులు అన్నారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, ఆఫీస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ రాజకీయ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అమరావతి రాజధానిపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

నదీ తీరానికి, నదీ పరీవాహక ప్రాంతానికి మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి రాజధానిపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సింధు నాగరికత ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకుంటే అమరావతిపై ఈ స్థాయి వ్యాఖ్యలు చేసేవారు కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా నదుల వెంబడి నాగరికతలు, నగరాలు వికసించాయని ఆయన గుర్తు చేశారు.