విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ తరహా వాతావరణం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకరు ఒకటంటే మరొకరు నాలుగంటారు. కానీ దీనికి భిన్నంగా మంత్రి నారా లోకేష్ మాత్రం తన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెబుతూ విమర్శకుల నోటికి తాళం వేస్తున్నారు. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక వీక్ పత్రిక ముఖ చిత్ర కథనంలో మెరిసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సదరు పత్రిక నారా లోకేష్ పనితీరును పూసగుచ్చినట్టు వివరించింది. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారని తెలిపింది. తద్వారా నారా లోకేష్ మంత్రిగా ఏం చేశారు? ఏం సాధించారు? అన్న ప్రశ్నలకు పరోక్షంగా ఇది సమాధానంగా మారింది. ఇక పెట్టుబడుల విషయాన్ని కూడా ప్రధానంగా ఈ పత్రిక హైలైట్ చేసింది. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

ఈ క్రమంలో గత ఏడాది చేసిన పలు పర్యటనలకు సంబంధించిన వివరాలను ప్రస్తావించింది. ఎవరు ఎవరు నారా లోకేష్‌ను కలుసుకున్నారు? ఎంతెంత పెట్టుబడులకు సంబంధించి ఆయన కృషి చేశారు? ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ రాక వంటి అంశాలను ప్రధానంగా ఈ పత్రిక ప్రస్తావించింది. తద్వారా నారా లోకేష్ విదేశాలకు వెళ్లి ఏం తెచ్చారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు పస లేకుండా పోయింది. ఆధారాలు, విషయాలతో సహా పత్రిక తేటతెల్లం చేయడం గమనార్హం.

మొత్తంగా ఇప్పుడే కాదు గతంలోనూ నారా లోకేష్‌పై వచ్చిన, వస్తున్న విమర్శలకు ఆయన పనితీరే సరైన సమాధానమని తాజా కథనం స్పష్టం చేస్తోంది. నోటి నోరు అన్నట్టుగా కాకుండా మంత్రి లోకేష్ తన పని తీరుతోనే సమాధానం చెబుతుండటం మరింత విశేషం. ఏదేమైనా మంత్రి వ్యవహార శైలిపై ఇక నుంచి విమర్శలు చేయాలని భావించే వారు, కామెంట్లు చేయాలని అనుకునే వారు కూడా ఒకసారి ఆలోచించుకునేలా నారా లోకేష్ పనితీరు ఉండటం గమనార్హం.