పచ్చని కోనసీమలో అగ్నికలకలం

ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పచ్చని కోనసీమ (ఇప్పుడు జిల్లా)లో ఉవ్వెత్తున ఎగసిపడిన మంటల కారణంగా వేలాది కొబ్బరి చెట్లు తగలబడి పోయాయి. దీంతో సమీపంలోని పలు గ్రామాల ప్రజలను కూడా అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేయించారు.

ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కోనసీమలోని రాజోలు నియోజకవర్గంలో ఉన్న మలికిపురం మండలం, ఇరుసుమండలోని ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో తీవ్ర కలకలం ఏర్పడింది.

ఈ ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లీకేజీ ఘటనపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలన్నారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ఓఎన్‌జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.

ఏం జరిగింది?

మలికిపురం మండలంలోని ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్ ఓవర్ రిగ్‌తో పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్‌తో కూడిన గ్యాస్ ఎగసిపడి మంటలు రాజుకున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.

సాధారణ మంటలకు భిన్నంగా భారీ ఎత్తున ఎగసిపడటంతో స్థానికులు భీతిల్లారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించారు. మరో 24 గంటలు గడిస్తే తప్ప మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని కలెక్టర్ తెలిపారు.

మరోవైపు గ్యాస్ లీక్, మంటల ఎగవేత అంశాలపై అంతర్జాతీయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నారు. మోరీ 5 ఆయిల్ వెల్‌కు, గెయిల్ పైప్‌లైన్‌కు ఈ ఘటనకు సంబంధం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మోరీ 5లో 20 నుంచి 40 క్యూబిక్ మీటర్ల నిల్వలు ఉండొచ్చని అంచనా వేశారు.

భద్రత దృష్ట్యా సమీపంలోని ఇళ్లు, పాఠశాలలను ఖాళీ చేయించారు. మరోవైపు ఓఎన్‌జీసీ సంస్థ కూడా తన అధికారులను హుటాహుటిన గ్రామానికి పంపించింది. అవసరమైన చర్యలు చేపట్టామని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సంస్థ స్పష్టం చేసింది.