తెలంగాణలో త్వరలోనే 117 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలలోనే వీటికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుంది. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో ఏపీకి చెందిన జనసేన కూడా వ్యూహాత్మకంగా ప్రయత్నాలు ప్రారంభించింది.
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న జనసేన పార్టీ అన్ని విభాగాల కమిటీలను రద్దు చేశారు. వీటి స్థానంలో కొత్తగా అభ్యర్థులను నియమించి కమిటీలను ఉత్తేజ పరచనున్నారు. అప్పటివరకు 30 రోజుల పాటు అమల్లో ఉండేలా తాత్కాలిక (అడహాక్) కమిటీలను నియమించారు. ఈ కమిటీలకు కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పగించారు.
ఇవీ కమిటీలు:
- జనసేన జీహెచ్‌ఎంసీ కమిటీ
- వీరమహిళ
- యువజన విభాగం
- విద్యార్థి విభాగం
ఈ కమిటీలకు ప్రస్తుతం ఉన్న అభ్యర్థులను తొలగించారు. వారి స్థానంలో తాత్కాలికంగా ఈ కమిటీలను నియమించారు. వచ్చే 15 రోజుల్లో ఈ తాత్కాలిక కమిటీలు వార్డుల వారిగా పర్యటించి బలమైన ఆకాంక్ష ఉన్న యువతను వెతికి పట్టుకోవాలని సూచించారు.
ప్రస్తుతం నియమించిన కమిటీలలోని యాక్టివ్ సభ్యులతో పాటు కొత్తగా నమోదు అయ్యే సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి వార్డు నుంచి కనీసం ఐదుగురు సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిని అన్ని విధాలా పరిశీలించిన తర్వాత కమిటీలను ఖరారు చేస్తారు. తద్వారా స్థానిక సంస్థల్లో విజయం లక్ష్యంగా జనసేన అడుగులు వేయనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates